: అమెరికా ద్వంద్వ వైఖరి బట్టబయలు.. ఒకవైపు ఉగ్రవాదంపై పోరు అంటూనే, మరోవైపు ఖతార్ కు యుద్ధ విమానాల అమ్మకం!
అగ్రరాజ్యం అమెరికాకు తన ప్రయోజనాలే అన్నింటికన్నా ముఖ్యమనే విషయం మరోసారి తేటతెల్లమైంది. ఉగ్రవాదంపై మూకుమ్మడిగా పోరాడాలంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇచ్చిన పిలుపుతో ఖతార్ తో సౌదీ అరేబియా, బహ్రెయిన్, ఈజిప్ట్, యూఏఈలు సంబంధాలను తెంచుకున్న విషయం తెలిసిందే. ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడంతో పాటు తమను అస్థిరపరుస్తోందని ఆరోపిస్తూ ఈ దేశాలు ఈ కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఖతార్ తో దౌత్య సంబంధాలను తెంచుకోవడమే కాకుండా, ఆ దేశానికి వెళ్లే రవాణా వ్యవస్థను సైతం నిలిపివేశాయి.
ఈ నేపథ్యంలో, అమెరికాతో 12 బిలియన్ డాలర్ల రక్షణ ఒప్పందాన్ని ఖతార్ కుదుర్చుకుంది. ఒప్పందంలో భాగంగా 36 ఎఫ్-15 జెట్ విమానాలను ఖతార్ కు అమెరికా సరఫరా చేయనుంది. ఈ విషయాన్ని అమెరికా రక్షణ సంస్థ పెంటగాన్ వెల్లడించింది. వాషింగ్టన్ లో అమెరికా, ఖతార్ రక్షణ మంత్రులు జిమ్ బ్యాటీస్, ఖలీద్ అల్ అథియాలు ఈ ఒప్పందంపై నిన్న సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.