: భారత్ తో ఓటమి మాలో కసి పెంచింది...అందుకే గెలిచాం: సర్ఫరాజ్ అహ్మద్
ఛాంపియన్స్ ట్రోఫీలో తొలి మ్యాచ్ లో భారత్ తో ఓటమిపాలు కావడం తమలో కసి పెంచిందని పాకిస్థాన్ జట్టు కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ తెలిపాడు. ఇంగ్లండ్ పై విజయం సాధించి ఫైనల్ లో ప్రవేశించిన నేపథ్యంలో సర్ఫరాజ్ మాట్లాడుతూ, టీమిండియాతో ఓటమిపాలు కావడంతో ప్రతి మ్యాచ్ లో గెలవాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపాడు. అందుకు కసిగా ప్రణాళికకు తగ్గట్టు ఆడామని అన్నాడు. భారత్ తో ఓటమి అనంతరం జట్టులో లోపాలు సరిదిద్దుకున్నామని చెప్పాడు. సిబ్బంది కూడా తమకి మద్దతుగా నిలిచారని, వారికి ధన్యవాదాలు చెప్పాడు.
సెమీఫైనల్లో ఇంగ్లండ్ పై విజయం బౌలర్ల వల్లే దక్కిందని తెలిపాడు. తమ బౌలర్లు అద్భుత ప్రదర్శన చేశారని కితాబిచ్చాడు. అమిర్ స్థానంలో జట్టులోకి రయీస్ ని తీసుకోవడంతో అతను తమ నమ్మకాన్ని నిలబెట్టాడని చెప్పాడు. జట్టుపై మేనేజ్ మెంట్ ఎలాంటి ఒత్తిడి తీసుకురాకపోవడంతో తమలో పట్టుదల పెరిగిందని అన్నాడు. సెమీస్ లో ఎలాగైనా గెలవాలని భావించామని, హాసన్ అలీ ప్రదర్శనతో విజయం వచ్చిందని తెలిపాడు. భారత్-బంగ్లాదేశ్ రెండు జట్లు బలమైనవేనని, ఫైనల్ కు ఎవరు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పాడు. ఫైనల్లో కూడా హాసన్ అలీ ఇలాంటి ప్రదర్శనే కొనసాగిస్తాడని సర్ఫరాజ్ ఆశాభావం వ్యక్తం చేశాడు.