: లండన్‌లో ఊరట లభించిన మర్నాడే.. విజయ్ మాల్యాపై చార్జిషీట్ దాఖలు చేసిన ఈడీ


బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి లండన్‌ పారిపోయిన మాజీ లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా సహా మరో ఆరుగురిపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు ముంబై ప్రత్యేక కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. మాల్యాను వెనక్కి రప్పించడంపై లండన్ కోర్టులో జరిగిన విచారణలో మాల్యాకు ఊరట లభించిన మర్నాడే ఈడీ చార్జిషీట్ దాఖలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

5వేల పేజీలు కలిగిన చార్జిషీట్ కాపీలను యూకేకు ఈడీ అధికారులు పంపించారు. మాల్యా కేసును విచారిస్తున్న లండన్‌ కోర్టుకు ఈ చార్జిషీట్ సాక్ష్యాధారంగా నిలుస్తుందని ఈడీ లాయర్ హెచ్ఎస్ వెనేగావోంకర్ తెలిపారు. ఈ చార్జ్‌షీట్‌లో మాల్యాతోపాటు కింగ్‌ఫిషర్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ ఎ.రఘునాథన్, ఐడీబీఐ బ్యాంక్ మాజీ చైర్మన్, ఎండీ యోగేశ్ అగర్వాల్, మరో నలుగురి పేర్లను ప్రస్తావించింది. కాగా, రెండు రోజుల క్రితం లండన్ కోర్టుకు హాజరైన విజయ్ మాల్యా తాను నిర్దోషినని పేర్కొన్నారు. అందుకు సంబంధించిన అన్ని ఆధారాలు తన వద్ద ఉన్నాయని పేర్కొన్న ఆయన భారత్‌ను ఎగతాళి చేస్తూ మాట్లాడారు. వేల కోట్ల రూపాయలు కాదని, బిలియన్ పౌండ్ల కోసం కలలు కనాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News