: జియోకు ఎదురుదెబ్బ.. యాక్టివ్ సబ్‌స్కైబర్లలో జియోను వెనక్కి నెట్టేసిన ఎయిర్‌టెల్
యాక్టివ్ సబ్‌స్క్రైబర్ల విషయంలో రిలయన్స్ జియోను భారతీ ఎయిర్‌టెల్ వెనక్కి నెట్టేసింది. గతేడాది సెప్టెంబరులో జియో లాంచ్ అయిన తర్వాత యాక్టివ్ సబ్‌స్క్రైబర్లు తగ్గడం జియోకు ఇదే తొలిసారి. ఏప్రిల్ నెలలో జియోతో పోలిస్తే ఎయిర్‌టెల్ ఎక్కువ మంది యాక్టివ్ సబ్‌స్క్రైబర్లను చందాదారులుగా చేర్చుకుంది. ‘వాయిస్ లొకేషన్ రిజిస్టర్ (వీఎల్ఆర్) ప్రకారం.. భారతీ ఎయిర్‌టెల్‌కు ఏప్రిల్‌లో 20.6 లక్షల మంది యాక్టివ్ సబ్‌స్క్రైబర్లు వచ్చి చేరగా కేవలం 4 లక్షల మందే జియో సభ్యత్వం తీసుకున్నారు.
మొబైల్ సర్వీసును ఉపయోగిస్తున్న వారి గురించి వీఎల్ఆర్ కచ్చితమైన డేటాను విడుదల చేస్తుంటుంది. యాక్టివ్ సబ్‌స్క్రైబర్ల విషయంలో వెనకబడడంపై జియో ఇప్పటి వరకు స్పందించలేదు. అయితే వీఎల్ఆర్ నివేదిక ప్రకారం మార్చిలో 72 మిలియన్ల మంది ఉన్న తమ వినియోగదారుల సంఖ్య ఏప్రిల్ చివరి నాటికి 80 మిలియన్లకు చేరుకున్నట్టు జియో అధికారులు చెబుతున్నారు.