: లండన్ అగ్నిప్రమాదం: పదో అంతస్తు నుంచి కిందపడిన చిన్నారి.. బంతిలా పట్టుకుని ప్రాణాలు కాపాడిన వైనం!
అది లండన్ పశ్చిమ ప్రాంతంలోని 24 అంతస్తుల గ్రెన్‌ఫెల్ టవర్. బుధవారం తెల్లవారుజామున ఒంటి గంట అవుతోంది. అందరూ గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఒక్కసారిగా నాలుగో అంతస్తులో అగ్ని ప్రమాదం సంభవించింది. పావుగంటలోనే మంటలు అపార్ట్‌మెంట్ మొత్తం పాకేశాయి. నిద్రమత్తు వదిలించుకున్న అపార్ట్‌మెంట్ వాసులు తమను తాము రక్షించుకునేందుకు పరుగులు తీశారు. కొందరు కిటికీల నుంచి దూకేశారు. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా 50 మందికిపైగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు.
అయితే ఈ ప్రమాదం సందర్భంగా ఓ అద్భుతం జరిగింది. పదో అంతస్తులో మంటల్లో చిక్కుకున్న ఓ మహిళ తన చేతిలోని బేబీని పై నుంచి కిందికి పడేసింది. కింద చాలామంది గుమిగూడి ఉండడంతో ఎవరైనా ఆ చిన్నారిని పట్టుకుంటారని, ప్రాణాలు నిలుస్తాయని భావించింది. ఆమె అంచనా నిజమైంది. కింద పడిపోతున్న బేబీని చూసిన ఓ వ్యక్తి పరుగెత్తుకుంటూ వచ్చి బంతిలా ఒడిసి పట్టుకున్నాడు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. దాదాపు ఐదేళ్ల వయసున్న ఓ చిన్నారిని ఓ మహిళ కిటికీ నుంచి కిందికి విసిరేయడం తాను చూశానని జరా అనే పొరిగింటావిడ పేర్కొంది.