: శిరీషపై ఎస్సై ప్రభాకర్ రెడ్డి అత్యాచారం చేశాడంటూ కేసును తప్పుదోవ పట్టిస్తున్నారు: భగ్గుమన్న కుకునూర్ గ్రామస్తులు
సిద్ధిపేట జిల్లా కొండపాక మండలం కుకునూరులో ఎస్సై ప్రభాకర్ రెడ్డి పోలీస్ స్టేషన్‌లోనే ఆత్మహత్య చేసుకోవడం పట్ల పోలీసు అధికారులు చెబుతున్న కారణాలపై ఆ గ్రామస్తులు మండిపడుతున్నారు. హైదరాబాద్ ఫిల్మ్ నగర్‌లో నిన్న అనుమానాస్పదంగా మృతి చెందిన బ్యూటీషియన్ శిరీష ఘటనకు, ఈరోజు ఆత్మహత్య చేసుకున్న ప్రభాకర్ ఘటనకు లింకు పెడుతూ పోలీసులు ఈ కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని ఆ గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మద్యం మత్తులో శిరీషపై ప్రభాకర్ అత్యాచారం చేసినట్లు అధికారులు అసత్య ఆరోపణలు చేస్తున్నారని కుకునూర్ గ్రామస్తులు చెబుతున్నారు.
ఈ రోజు మీడియాలోనూ ఇటువంటి కథనాలే రావడంతో ఆ వార్తలను ఖండిస్తూ ఆందోళనకు గ్రామస్తులు దిగారు. ప్రభాకర్‌రెడ్డి ఎంతో మంచి వ్యక్తని, కుకునూర్ పోలీసు స్టేషన్ పరిధిలోని 26 గ్రామాల ప్రజలకు ఆయన ఎటువంటి వాడో తెలుసునని అంటున్నారు. పోలీసులు ఇచ్చిన తప్పుడు సమాచారంతో మీడియాలో తప్పుడు కథనాలు ప్రసారం చేస్తున్నారని అన్నారు. పోలీసు అధికారుల ఒత్తిడితోనే ప్రభాకర్‌రెడ్డి చనిపోయాడని, ఆయనను హత్యే చేసి ఉండవచ్చునని ఆరోపిస్తున్నారు. ధైర్యవంతుడైన ప్రభాకర్‌రెడ్డి ఆత్మహత్య ఎందుకు చేసుకుంటాడని వారు అంటున్నారు.