: 36 ఎకరాల సేల్ డీడ్‌ను రద్దు చేసుకుంటా.. మా డబ్బు మాకు వడ్డీతో పాటు చెల్లించాలి: కేకే
టీఆర్‌ఎస్ రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు కొన్న భూముల వ్యవహారం తీవ్ర వివాదాస్పదంగా మారుతున్న నేపథ్యంలో ఆయన ఆ భూముల సేల్ డీడ్‌ను రద్దు చేసుకుంటానని అన్నారు. 36 ఎకరాల సేల్ డీడ్‌ను రద్దు చేసుకుని ఇందుకు ప్రతిగా తాము భూములు కొనుగోలుకు చెల్లించిన డబ్బును వడ్డీతో సహా తీసుకుంటామని చెప్పారు. ఇందు కోసం తాము అవసరమైతే కోర్టుమెట్లు కూడా ఎక్కుతామని అన్నారు. తమకు ఆ భూములు అమ్మిన గోల్డ్‌స్టోన్ ప్రసాద్ కు నోటీసులు కూడా పంపిస్తామని వ్యాఖ్యానించారు.
ఈ భూముల వ్యవహారంలో తమ సొంత పార్టీతో తాను గొడవ పెట్టుకోదల్చుకోలేదని అన్నారు. రాష్ట్ర సర్కారుకి మచ్చ రాకూడదనే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని అన్నారు. తాజాగా స్థానిక రెవెన్యూ శాఖ అధికారులు ప్రభుత్వానికి పలు సూచనలు చేశారు. ఆ 36 ఎకరాల భూముల రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయాలని అన్నారు. ఈ మేరకు సర్కారుకి నివేదిక పంపారు. ఈ నేపథ్యంలోనే ఆయన స్వచ్ఛందంగా సేల్ డీడ్ రద్దుచేసుకోవాలని భావిస్తున్నారు.