: ‘సీన్లు కూడా అభ్యంతరకరంగా ఉన్నాయి’... ‘డీజే’ మూవీపై బ్రాహ్మణ సంఘాల మరో ఫిర్యాదు
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, యంగ్ డైరెక్టర్ హరీశ్ శంకర్ కాంబినేషన్‌లో రూపుదిద్దుకున్న చిత్రం ‘డీజే’ను వివాదాలు వదిలేలా కనపడడం లేదు. ఈ సినిమాలోని 'గుడిలో బడిలో మడిలో వడిలో' అనే పాటపై బ్రాహ్మణ సంఘాలు తీవ్ర స్థాయిలో మండిపడడంతో ఆ పాటలో అభ్యంతరంగా ఉన్న పదాలను తొలగిస్తామని హరీశ్ శంకర్ నిన్న మరోసారి ప్రకటన చేసిన విషయం తెలిసిందే. కాగా, ఈ రోజు బ్రాహ్మణ సంఘాలు ‘డీజే’ సినిమాపై మరోసారి ఫిర్యాదు చేశాయి. సినిమాలోని ఆ పాటలో అభ్యంతరకర పదాలతో పాటు అభ్యంతరకర సీన్లు కూడా ఉన్నాయని బ్రాహ్మణ సంఘాల సభ్యులు హెచ్‌ఆర్‌సీకి ఫిర్యాదు చేశారు.
దీనిపై స్పందించిన హెచ్‌ఆర్‌సీ డీజేలో అభ్యంతరకర పాట, సీన్లు ఉంటే తొలగించాలని, బ్రాహ్మణ సంఘాల ఫిర్యాదుపై విచారణ జరిపించాలని తెలంగాణ సీఎస్, సినిమాటోగ్రఫీ, ప్రాంతీయ సెన్సార్‌బోర్డు కమిషనర్‌లకు ఆదేశాలు జారీచేసింది. ఈ విషయంపై తమకు ఈ నెల 19లోగా నివేదిక ఇవ్వాలని సూచించింది.