: విపరీతంగా మాంసాహారం భుజించాడు... రక్తం తెల్లగా మారిపోయింది!
అతడికి మాంసాహారమంటే ప్రాణం.. చికెన్ లేక మటన్ లేనిదే ముద్దదిగదు. అయితే, అతిగా ఏది తీసుకున్నా అనర్థమే అన్న సంగతి మరచి, ఆ మాంసాహార ప్రియుడు విపరీతంగా మాంసం లాగించేసేవాడు. దీంతో చివరికి అతడికి విపరీతమైన కడుపునొప్పి పట్టుకుంది. దీంతో వైద్యుల వద్దకు వెళ్లగా అతడికి బ్లడ్ టెస్ట్ చేయాలని చెప్పారు. విచిత్రం ఏమిటంటే, రక్తం శాంపిల్ తీస్తుంటే అతడి శరీరంలోంచి ఎర్ర రక్తానికి బదులు తెల్లని రక్తం వచ్చింది.
దీంతో వైద్యులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆ వ్యక్తి మాంసాహారం అధికంగా తీసుకోవడం వల్ల బ్లడ్ ప్లాస్మాలో విపరీతంగా కొవ్వు పేరుకుపోయిందని, దీంతో రక్తం ఇలా తెల్లగా మారిపోయిందని వైద్యులు వివరించారు. ఇటువంటి కేసులు అత్యంత అరుదుగా వస్తాయని వైద్యులు చెప్పారు. వెంటనే అతడికి చికిత్స చేయడంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటన చైనాలో చోటుచేసుకుంది. చావో అనే 40 ఏళ్ల మాంసాహార ప్రియుడు నాన్‌వెజ్‌ని అతిగా లాగించడంతో ఇలా ప్రాణంమీదకు తెచ్చుకున్నాడు. మాంసాహారం మీద ఉన్న ఇష్టంతో ఇలా విపరీతంగా తినేశానని, తన అలవాటే తనకు ముప్పు తెస్తుందని అనుకోలేదని చెప్పాడు.