: ఏమీ ఆశించకుండా టీడీపీకి సేవ చేసినందుకు కనీస గుర్తింపు కూడా లభించలేదు!: శిల్పా
తాను తెలుగుదేశం పార్టీని వీడితే కలిగే నష్టం గురించి చంద్రబాబుకు తెలుసునని, నంద్యాల టికెట్ తనకు ఇస్తానని చంద్రబాబు చెప్పినా, వద్దని వైకాపాలోకి వచ్చానని శిల్పా మోహన్ రెడ్డి తెలిపారు. అన్ని రకాలుగా పనిచేయగలిగిన స్థితిలో ఉండి, సమర్థుడైన నేతకు సరైన గుర్తింపు టీడీపీలో లభించలేదని ఆరోపించిన ఆయన, జగన్ మంచి నాయకుడని కొనియాడారు. తనకు సరైన గౌరవం దక్కకుంటే, పార్టీని వీడే పరిస్థితి వస్తుందని ముందుగానే చంద్రబాబును హెచ్చరించామని, ఆయన మాత్రం పట్టించుకోలేదని ఆరోపించారు.
అమెరికా వెళ్లి వచ్చిన తరువాత నంద్యాల విషయంలో నిర్ణయం తీసుకుంటామని, తనకే టికెట్ ఇస్తున్నట్టు ప్రకటిస్తానని చెప్పిన చంద్రబాబు, తదుపరి నాన్చుడు ధోరణి కనబరిచారని ఆరోపించారు. ఆపై తనకు విసుగు చెంది కార్యకర్తలతో సమావేశం పెట్టిన తరువాత, టికెట్ ఇస్తున్నట్టు తనకు చెప్పి, మళ్లీ దాటవేత ధోరణినే అవలంబించారని అన్నారు. ఎప్పుడు చూసినా సమీక్షలు, వీడియో కాన్ఫరెన్స్ లంటూ క్షేత్ర స్థాయిలో సమస్యలపై చంద్రబాబు దృష్టిని సారించలేదని దుయ్యబట్టారు. ఏమీ ఆశించకుండా టీడీపీకి సేవ చేసినందుకు కనీస గుర్తింపు కూడా లభించలేదని, సమస్యలను లోకేష్ దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోయిందని అన్నారు.