: హిందీలో బాహుబలి 2 అంతపెద్ద విజయం సాధించడం వెనుక కారణం ఇదే!: సల్మాన్ ఖాన్
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ‘బాహుబలి-2: ద కన్ క్లూజన్’ హిందీ చిత్రపరిశ్రమలో రికార్డులు బద్దలు కొట్టడం వెనుక కారణం వివరించాడు. 'ట్యూబ్ లైట్' ప్రమోషన్ లో భాగంగా ‘బాహుబలి-2: ద కన్ క్లూజన్’ సినిమాపై తన అభిప్రాయం చెబుతూ, ‘బాహుబలి-2’ అద్భుత విజయానికి కారణం హిందీ ప్రేక్షకుల ఆదరణ అని ఒక్క మాటలో తేల్చేశాడు. దక్షిణాదికి చెందిన ఇద్దరు, ముగ్గురు నటీనటులు మాత్రమే బాలీవుడ్ ప్రేక్షకులకు తెలుసని, అయినప్పటికీ హీరో స్టార్ డమ్ చూడకుండా ఈ సినిమాను ఉత్తరాదికి చెందిన ప్రేక్షకులు ఆదరించారని అన్నాడు.
అదే దక్షణాది ప్రేక్షకులకు తాము తెలిసినా తమ సినిమాలను పెద్దగా చూడరని అన్నాడు. దక్షిణాదిలో కమలహాసన్ ఫ్యాన్ ఉన్నాడంటే అతను చివరి వరకు కమల్ నే అభిమానిస్తాడని చెప్పాడు. అలాగే రజనీ ఫ్యాన్ రజనీనే ఆదరిస్తాడని అన్నాడు. వారితో పోల్చుకుని తమ సినిమాలను ఆదరించరని తెలిపాడు. అందుకే తమ సినిమాలో దక్షిణాదిలో నేరుగా విడుదల చేసినా పెద్దగా వసూళ్లు రాబట్టవని చెప్పాడు. ఉత్తరాది ప్రేక్షకులు అలా కాదని, హీరో ఎవరు అన్నది చూడరని తెలిపాడు. అందుకే హిందీలో ‘బాహుబలి-2: ద కన్ క్లూజన్’ సినిమా అద్భుత విజయం సాధించిందని చెప్పాడు.