: తెలుగుదేశం పార్టీని వీడడానికి అసలు కారణమిదే: శిల్పా మోహన్ రెడ్డి
కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీలో, ముఖ్యంగా నంద్యాల నియోజకవర్గంలో అంతర్గత వర్గ విభేదాలు పెరిగిపోయాయని, తెలుగుదేశం నాయకత్వం అలసత్వ, నిర్లక్ష్య ధోరణితో విసిగిపోయి పార్టీని వీడానని మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ ఉదయం జగన్ సమక్షంలో వైకాపా తీర్థం పుచ్చుకున్న ఆయన మీడియాతో మాట్లాడుతూ, పార్టీని వీడిన కారణాలను వెల్లడించారు.
టీడీపీలో జరుగుతున్న తాజా పర్యవసానాలతో తాను విసుగు చెందానని, పెన్షన్లు, రేషన్ కార్డులు, ఇళ్లు, పట్టాల విషయంలో సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినా పరిష్కారం కాలేదని శిల్పా ఆరోపించారు. గ్రామ నాయకులతో పాటు సర్పంచ్, జడ్పీటీసీ, ఎంపీటీసీలను, ఎంపీపీలను పట్టించుకునే వారే లేకపోయారని అన్నారు. ప్రజా ప్రతినిధులు ఇష్టా రాజ్యంగా వ్యవహరించారని ఆరోపించారు. కనీస ప్రొటోకాల్ ను పాటించిన దాఖలాలు ఎన్నడూ కనిపించలేదన్నారు. నంద్యాల నియోజకవర్గంలో ప్రజల అభివృద్ధికి వైకాపాతో కలసి కృషి చేస్తానని శిల్పా హామీ ఇచ్చారు. కేడర్ ను కాపాడుకునేందుకే తాను వైకాపాలో చేరుతున్నట్టు చెప్పారు.