: టెన్త్ ఫస్ట్ క్లాస్ లో పాసైన మరాఠీ సూపర్ హిట్ సినిమా హీరోయిన్!
మరాఠీ సినిమా 'సైరాట్' హీరోయిన్ రింకు (ప్రేరణ) టెన్త్ క్లాస్ ఫస్ట్ క్లాస్ లో పాసైంది. మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లాలోని అక్లుంజ్ అనే ఓ చిన్న పట్టణానికి చెందిన రింకూ (17) జజియామాతా కన్యా ప్రశాల పాఠశాలలో విద్యాభ్యాసం చేస్తోంది. 'సైరాట్' సినిమాతో వచ్చిన స్టార్ డమ్ కారణంగా పాఠశాలకు వెళ్లలేక, ప్రైవేటుగా పరీక్షలు రాసింది. తాజాగా మహారాష్ట్ర టెన్త్ బోర్డ్ విడుదల చేసిన పదోతరగతి ఫలితాల్లో 66.40 శాతం మార్కులతో ఫస్ట్ క్లాస్ లో పాసైంది. హిందీలో అత్యధికంగా 87 మార్కులు తెచ్చుకోగా, మాతృభాష మరాఠీలో మాత్రం 83 మార్కులు సాధించింది. సైన్స్ అండ్ టెక్నాలజీలో 42, మ్యాథ్స్ 48, సోషల్ 50, ఇంగ్లీష్ 59 మార్కులు సంపాదించింది. 'సైరాట్' సినిమా మరాఠీ సినీ చరిత్రలో అద్భుత కావ్యంగా నిలిచిపోగా, 100 కోట్ల రూపాయల వసూళ్లు సాధించిన తొలి మరాఠీ సినిమాగా నిలిచింది.
ఈ సినిమాలో నటించిన ఆకాష్, రింకు ఇద్దరూ రాత్రికి రాత్రే స్టార్ నటులైపోయారు. కోలీవుడ్ లో వచ్చిన 'ప్రేమిస్తే' సినిమా పోలికలతో ఉండే ఈ సినిమా అద్భుతమైన విజయం సాధించింది. ఈ సినిమాను తమిళ, మలయాళ, హిందీ, తెలుగు భాషల్లో రీమేక్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. హిందీలో ప్రముఖ నటి శ్రీదేవి కుమార్తె జాహ్నవిని ఈ సినిమా రీమేక్ తో బాలీవుడ్ అరంగేట్రం చేయించేందుకు ప్రముఖ దర్శకుడు కరణ్ జోహర్ ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. కన్నడలో రాక్ లైన్ వెంకటేష్ నిర్మించిన ఈ సినిమా అక్కడ కూడా అద్భుత విజయం సాధించింది. అందులో కూడా రింకూయే హీరోయిన్ గా నటించడం విశేషం.