: ఇకపై సినిమాల్లో నటించను: మంచు మనోజ్ సంచలన నిర్ణయం
సినీ నటుడు మంచు మనోజ్ సంచలన నిర్ణయం ప్రకటించాడు. ప్రస్తుతం చేస్తున్న ‘ఒక్కడు మిగిలాడు’ సినిమాతో పాటు, ఇప్పటికే అంగీకరించిన మరో సినిమా పూర్తి చేసిన అనంతరం ఇకపై ఎలాంటి సినిమాల్లో నటించనని ప్రకటించాడు. తన ఫేస్ బుక్ ద్వారా ఈ విషయాన్ని మంచు మనోజ్ తెలిపాడు. అందరికీ ధన్యవాదాలు చెప్పాడు. అయితే మంచు మనోజ్ అకస్మాత్తుగా ఈ నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో మాత్రం వివరించలేదు. మంచు మనోజ్ కుటుంబంలో అందరూ సినీ నటులు కావడం విశేషం. తాజాగా మంచు లక్ష్మి రాజకీయాల్లోకి రానుందంటూ ప్రచారం జరిగింది.
తాజాగా మంచు మనోజ్ ప్రకటనతో మంచు లక్ష్మికి బదులుగా మంచు మనోజ్ రాజకీయ రంగప్రవేశం చేయనున్నాడా? అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చిత్తశుద్ధి నిరూపించుకునేందుకే సినీ పరిశ్రమకు బై చెబుతున్నాడా? అని ఫిల్మ్ నగర్ గుసగుసలాడుకుంటోంది. కాగా, మంచు మనోజ్ తన తండ్రి మోహన్‌బాబు నటించిన ‘మేజర్ చంద్రకాంత్’ చిత్రంతో చైల్డ్ ఆర్టిస్ట్ గా సినీ రంగప్రవేశం చేశాడు. యువనటుడిగా 'దొంగ దొంగది', 'శ్రీ', 'ప్రయాణం', 'మిస్టర్ నూకయ్య', 'వేదం' తదితర సినిమాల్లో నటించాడు. ప్రస్తుతం మనోజ్ ‘ఒక్కడు మిగిలాడు’లో ద్విపాత్రాభినయం చేస్తున్నాడు.