: రైలు టికెట్ల బుకింగ్ మరింత సులభం!
రైల్వే శాఖ నేతృత్వంలోని ఐఆర్సీటీసీ వెబ్ సైట్ నుంచి టికెట్ల బుకింగ్ మరింత ఈజీ కానుంది. టికెట్ల కోసం వెబ్ సైట్ ను ఓపెన్ చేసినప్పుడు కనిపించే బెర్తులు, ఆపై చెల్లింపు సమయానికి వెయిటింగ్ లిస్టులోకి రావడం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా తక్షణ ప్రయాణానికి తత్కాల్ కోటాలో టికెట్లు బుక్ చేసుకోవాలని భావించే వారిని ఈ సమస్య వేధిస్తోంది. ఇలా చెల్లింపులకు మరింత సమయం పట్టకుండా చూసేందుకు ఐఆర్సీటీసీ ఎం-వీసా పద్ధతిని అందుబాటులోకి తెచ్చింది.
ఈ సదుపాయాన్ని వాడుకోవాలంటే, కస్టమర్లు, తమ తమ వీసా డెబిట్, క్రెడిట్ కార్డులు లేదా ప్రీపెయిడ్ అకౌంటును ఎం-వీసా యాప్ కు అనుసంధానం చేసుకోవాలి. ఆపై టికెట్ బుక్ చేసుకునేటపుడు క్యూఆర్ కోడ్ వస్తుంది. దాన్ని స్మార్ట్ ఫోన్ తో స్కాన్ చేస్తే, మరుక్షణమే చెల్లింపు పూర్తవుతుంది. ఇక ఎం-వీసాను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రమోషనల్ ఆఫర్ గా సెప్టెంబర్ 4 వరకూ బుక్ చేసుకునే టికెట్లపై రూ. 50 క్యాష్ బ్యాక్ ను అందించనున్నట్టు అధికారులు తెలిపారు.