: ముఖ్యమంత్రి చంద్రబాబు తప్పిదం.. అత్యాచారానికి గురైన బాలిక పేరు, ఫొటోను ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన సీఎం!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తప్పిదం చేశారు. మాజీ సైనికుడు ఒకరు బాలికను 50 రోజులపాటు కిడ్నాప్ చేసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. తమకు న్యాయం చేయాల్సిందిగా బాధిత బాలిక తల్లిదండ్రులు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి వేడుకున్నారు. ఆర్థిక సాయం అందించాల్సిందిగా కోరారు. అనంతరం మంగళవారం చంద్రబాబు బాధిత బాలిక పేరు, ఫొటోను ఆయన అధికారిక ట్విట్టర్ పేజ్‌లో పోస్టు చేశారు. నిజానికి ఇటువంటి కేసుల్లో బాధితుల పేర్లు, ఫొటోలు వెల్లడించడం ప్రొటక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రం సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్ (పోస్కో) ప్రకారం నేరంగా పరిగణిస్తారు. అంతేకాదు చట్టపరంగా చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంది.
బాధిత బాలిక కుటుంబ సభ్యుల ఫొటోను తన ట్విట్టర్ పేజీలో పోస్ట్ చేసిన సీఎం ఆమె పేరును పేర్కొంటూ జరిగిన ఘటనపై ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె భవిష్యత్తు సాఫీగా గడిచేందుకు ఆర్థిక సాయం అందించనున్నట్టు తెలిపారు. అయితే మంగళవారం సాయంత్రం ఆ ట్వీట్‌ను డిలీట్ చేశారు. కాగా, నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది.