: ఛాంపియన్స్ ట్రోఫీలో నేడు కీలక పోరు
ఛాంపియన్స్ ట్రోఫీలో నేడు కీలక పోరు జరగనుంది. కార్డిఫ్ వేదికగా ఇంగ్లండ్ జట్టుతో పాకిస్థాన్ జట్టు సెమీ ఫైనల్ మ్యాచ్ ఆడనుంది. ఈ మైదానంపై రెండు జట్లకు పట్టుంది. లీగ్ దశలో పాకిస్థాన్ ఇక్కడ రెండు మ్యాచ్ లు ఆడగా, ఇంగ్లండ్ కు ఇది సొంత మైదానం కావడం విశేషం. మ్యాచ్ ఫేవరేట్ గా ఇంగ్లండ్ బరిలో దిగుతోంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ రంగాల్లో ఇంగ్లండ్ ఆటగాళ్లు అద్భుతంగా రాణిస్తున్నారు. మరోవైపు స్థానిక అభిమానుల మద్దతు ఇంగ్లండ్ కే ఎక్కువ దొరుకుతుంది. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్ లో ఇంగ్లండ్ దే విజయమని విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు పాకిస్థాన్ ఎప్పుడెలా ఆడుతుందో తెలియదు. నిలకడలేమి వల్ల కుప్పకూలవచ్చు. సమష్టిగా రాణించి, బోల్తా కొట్టించనూ వచ్చు.
ఎందుకంటే భారత్ తో మ్యాచ్ లో కుప్పకూలిన పాకిస్థాన్, శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో ఊహించని విధంగా రాణించి విజయం సాధించింది. బౌలింగ్ లో ఆకట్టుకునే వనరులున్న పాకిస్థాన్ కు బ్యాటింగ్, ఫీల్డింగ్ లో లోపాలు కనిపిస్తున్నాయి. జట్టులో బ్యాట్స్ మన్ నిలకడ ప్రదర్శించడంలో తడబడుతున్నారు. దీంతో పాక్ జట్టు ఆదిలోనే వికెట్లు కోల్పోతోంది. అయితే ఈ మ్యాచ్ లో వాటన్నింటినీ అధిగమించి ఫైనల్ లో చేరాలని పాక్ భావిస్తోంది. అయితే సమీకరణాలన్నీ ఇంగ్లండ్ కి అనుకూలంగా ఉండడం విశేషం. ఈ నేపథ్యంలో పాక్ కెప్టెన్ మీడియాతో మాట్లాడుతూ, అల్లా దయ తమపై ఉందని, అందుకే శ్రీలంకతో మ్యాచ్ లో విజయం సాధించామని, ఇంగ్లండ్ తో మ్యాచ్ లో కూడా విజయం సాధిస్తామని విశ్వాసం వ్యక్తం చేశాడు.