: జన్మనిచ్చిన తండ్రి పిల్లల్ని తనతో తీసుకెళ్లడం కిడ్నాప్ కిందకు కాదు.. కోర్టుకు తెలిపిన విదేశాంగ శాఖ


బయోలాజికల్ ఫాదర్ (జన్మనిచ్చిన తండ్రి) తన పిల్లల్ని తీసుకెళ్లడం కిడ్నాప్ కిందకు రాదని విదేశాంగ శాఖ బాంబే హైకోర్టుకు తెలిపింది. తన కుమార్తెను అపహరించి భారత్ తీసుకెళ్లిపోయాడంటూ మాజీ భర్తపై డచ్‌కు చెందిన ఆయన మాజీ భార్య ఆరోపించింది. ఆయనను అరెస్ట్ చేసి తమకు అప్పగించాలంటూ నెదర్లాండ్స్ ప్రభుత్వం బాంబే హైకోర్టును ఆశ్రయించింది. దీంతో స్పందించిన విదేశీ మంత్రిత్వ శాఖ, సీబీఐ స్పందిస్తూ కన్న కుమార్తెను తనతోపాటు తీసుకెళ్లడం కిడ్నాప్ కిందకు రాదని, కాబట్టి అతడిని అరెస్ట్ చేయాలన్న డచ్ ప్రభుత్వ అభ్యర్థనను కొట్టివేయాలని కోర్టుకు తెలిపాయి. వివరాల్లోకి వెళ్తే..

ముంబైకి చెందిన వ్యాపారవేత్త సాజిద్ షా, డచ్‌కు చెందిన నంజీన్ భార్యాభర్తలు(ఇవి వారి అసలు పేర్లు కావు). అనంతరం కొన్ని కారణాలతో వీరు విడిపోయారు.  2016లో ఆయన తన రెండేళ్ల కూతురితో కలిసి భారత్ వచ్చేశాడు. దీంతో తన కుమార్తెను మాజీ భర్త కిడ్నాప్ చేశాడని నంజీన్ ఆరోపించింది. అంతేకాదు ఆమెను తిరిగి వెనక్కి తీసుకొచ్చేందుకు ఆన్‌లైన్‌లో ప్రచారం ప్రారంభించింది. సాజిద్ అరెస్ట్ కోసం ఇంటర్‌పోల్ రంగంలోకి దిగి నోటీస్ జారీ చేసింది. నెదర్లాండ్స్ ప్రభుత్వం భారత ప్రభుత్వంతో చర్చలు జరిపింది. కుమార్తెను కిడ్నాప్ చేసిన అతడిని అరెస్ట్ చేసి తమకు అప్పగించాల్సిందిగా బాంబే హైకోర్టును ఆశ్రయించింది. నెదర్లాండ్స్ పిటిషన్‌పై స్పందించిన సీబీఐ, విదేశీ మంత్రిత్వ శాఖలు బాంబే హైకోర్టుకు అఫిడవిట్ సమర్పించాయి. ‘‘జన్మనిచ్చిన కుమార్తెను తనతోపాటు తీసుకెళ్లడం కిడ్నాప్ కిందకు రాదు. అది తీవ్రమైన నేరం అంతకంటే కాదు’’ అని సీబీఐ అసిస్టెంట్ డైరెక్టర్ బీపీ బగ్చి తెలిపారు. సాజిద్‌ను తమకు అప్పగించాలన్న నెదర్లాండ్స్ అభ్యర్థనను భారత విదేశాంగ శాఖ మే 5న తిరస్కరించింది.

 కాగా, ఆమ్‌స్టర్‌డ్యామ్‌లో 2010లో జరిగిన ఇండియన్ ఫిల్మ్ అవార్డ్ వేడుకలో కలుసుకున్న నంజీన్, సాజిద్‌లు 2011లో ప్రేమ వివాహం చేసుకున్నారు. 2014లో పాప పుట్టిన తర్వాత ఇద్దరూ విడిపోయారు. దీంతో కుమార్తె తల్లి వద్దే ఉండాలని 2016లో డచ్ కోర్టు తీర్పు చెప్పింది. అయితే అదే ఏడాది సాజిద్ తన కుమార్తెతో కలిసి ముంబై చేరుకున్నాడు. సాజిద్ తన కుమార్తెను అపహరించాడంటూ ఫేస్‌బుక్‌లో నంజీన్ చేసిన పోస్టింగ్ వైరల్ అయ్యింది.

  • Loading...

More Telugu News