: స్కాలర్ షిప్ పేరుతో నన్ను గ్యాంగ్ రేప్ చేశారు... నాకు న్యాయం చేయండి: నేరుగా ప్రధానికి లేఖ రాసిన దళిత బాలిక!


స్కాలర్ షిప్ ఇప్పిస్తా రావాలంటూ కారులో తీసుకెళ్లి తన స్కూలు చిరుద్యోగి, అతని స్నేహితులతో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడని...ఆ దారుణాన్ని మొబైల్ లో చూపిస్తూ బెదిరిస్తున్నారని, తనకు న్యాయం చేయాలని కోరుతూ బాలిక నేరుగా ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయానికి లేఖ రాయడం ఆసక్తి రేపుతోంది. దీనిపై కర్ణాటకలోని బాగల్ కోట్ ఎస్పీ మాట్లాడుతూ, జిల్లాలోని శిరూరు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న దళిత విద్యార్థిని (16)కి ఉపకార వేతనం ఇప్పిస్తానని నమ్మించి, ఉన్నతాధికారులను కలవాలని చెబుతూ, అదే పాఠశాల చిరుద్యోగిగా పని చేస్తున్న విజయకుమార్‌ కాళవ్వగోళ, తన ఇద్దరు స్నేహితులతో కలిసి కారులో తీసుకెళ్లాడు. మార్గ మధ్యంలో బాలికను స్పృహ తప్పిపోయేలా చేసి, గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. అంతే కాకుండా ఆ దారుణాన్ని సెల్ ఫోన్ లో చిత్రీకరించారు.

ఆ వీడియోను చూపిస్తూ...జరిగిన దాని గురించి ఎవరికైనా చెబితే ప్రాణాలు తీస్తామంటూ హెచ్చరిస్తున్నారు. గ్యాంగ్ రేప్ అనంతరం తీవ్రమైన జ్వరంతో ఆసుపత్రికి వెళ్తే...వైద్యుడు కూడా గ్యాంగ్ రేప్ ను గుర్తించాడని, తన తల్లిదండ్రులకు చెబితే పరువు, మర్యాదల కోసం పోలీస్ కేసు పెట్టేందుకు వెనుకాడుతున్నారని బాలిక తన లేఖలో వాపోయింది. విజయ్ కుమార్ కాళవ్వగోళ, అతని స్నేహితులు తనలాగే మరికొందరు విద్యార్థినులపై లైంగిక దాడులు చేస్తున్నారని, తనకు న్యాయం జరిగేలా చేయాలని కోరుతూ ప్రధాని కార్యాలయంతో పాటు, దాని నకలు ప్రతులను జిల్లా ఎస్పీ, జిల్లా అధికారి, జిల్లా పంచాయతీ ముఖ్యకార్యనిర్వహణ అధికారి, విద్యాశాఖాధికారులకు పంపింది. దీంతో కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించామని ఎస్పీ చెప్పారు. 

  • Loading...

More Telugu News