: ఆ కేసులను అటకెక్కించిన కేసీఆర్.. ఇప్పుడు దీన్ని కూడా నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు: రేవంత్ రెడ్డి
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన ఎంసెట్ లీకేజీ, నయీమ్ ల కేసులను ముఖ్యమంత్రి కేసీఆర్ అటకెక్కించారని... ఇప్పుడు అదే దారిలో మియాపూర్ భూ కబ్జా కేసును కూడా బుట్ట దాఖలు చేసే ప్రయత్నం చేస్తున్నారంటూ టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. మియాపూర్ భూ కుంభకోణం రూ. 15 వేల కోట్ల విలువైనదని... ఇదే విధంగా మణికొండలోని కాందిశీకుల భూములను కూడా కాజేశారని తెలిపారు.
టీ-టీడీపీ అధ్యక్షుడు రమణ మాట్లాడుతూ మియాపూర్ భూ కుంభకోణం కేసును సీబీఐకి అప్పగించి ముఖ్యమంత్రి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. భూ కబ్జా వ్యవహారం వెలుగులోకి వచ్చి 20 రోజులు గడుస్తున్నా... దీనిపై కేసీఆర్ ఇంతవరకు ఎందుకు నోరు మెదపలేదని ప్రశ్నించారు. విచారణను సీఐడీకి అప్పగించి, కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. మియాపూర్ భూ కుంభకోణం అసలు నిందితులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ, ఈ రోజు రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ వద్ద టీటీడీపీ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ఈ సందర్భంగా రేవంత్, రమణలు మాట్లాడుతూ ప్రభుత్వంపై విమర్శలు కురిపించారు.