: దర్శకుడు హరీశ్ శంకర్ ఇంత మోసం చేస్తాడా?.. ఇదే మా హెచ్చరిక!: బ్రాహ్మణ సంఘాలు
దర్శకుడు హరీశ్ శంకర్ తమను ఇంత మోసం చేస్తాడా? అంటూ బ్రాహ్మణ సంఘాల సభ్యులు మండిపడుతున్నారు. శివుడికి ప్రీతికరమైన నమక, చమకాలను శృంగారపరంగా ప్రస్తావించడంపై వారు అభ్యంతరం వ్యక్తం చేయగా, వాటిని తొలగిస్తామని హామీ ఇచ్చిన హరీశ్ శంకర్ ఇచ్చిన మాటను తప్పి మొన్న నిర్వహించిన ఆడియో ఫంక్షన్‌లో మళ్లీ అదే పాట వినిపించారని, సినిమాలోనూ అలాగే చూపించడానికి రెడీ అయ్యారని బ్రాహ్మణ సంఘాల సభ్యులు వెంకట రమణ శర్మ, గోగులపాటి కృష్ణ మోహన్ మండిపడ్డారు. తాము ఇదే అంశంపై సెన్సార్ బోర్డుకి కూడా వెళ్లామని చెప్పారు. వారు కూడా సరిగా స్పందించకపోతే వారి మీద కూడా న్యాయ పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు.
ఇటువంటి చర్యలను తాము చూస్తూ ఊరుకోబోమని, అన్ని సంఘాల మద్దతు కూడగట్టి పోరాడతామని అన్నారు. ఇది కేవలం బ్రాహ్మణులకు సంబంధించిన అంశమే కాదని, హిందూ మతానికి సంబంధించిందని అన్నారు. ఈ బ్రాహ్మణులు ఏం చేస్తారులే అని హరీశ్ శంకర్ అనుకుంటున్నారని, తామేంటో చూపిస్తామని హెచ్చరించారు. మొన్న ఆడియో వేడుకలో హరీశ్ శంకర్ అది తన పైత్యం వల్లే రాయించుకున్నానని అన్నారని, ఆ పాటపై పూర్తి బాధ్యత తనదేనని చెప్పుకున్నారని వారు అన్నారు. ఆ పదాలను తొలగిస్తామని చెప్పి, ఇంత మోసం చేసి హిందూ మతాన్ని అవహేళన చేశారని మండిపడ్డారు. పాటలో రుద్రం, నమకం, చమకం అనే పదాలను ఉపయోగించారని అన్నారు. అటువంటి పరమపవిత్ర పదాలను శృంగార రసాలకు జోడించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ నటి నృత్యం చేస్తోంటే ఆమెపై ఈ పదాలను ప్రయోగించారని అన్నారు. నమక చమకాలతో ఓ అమ్మాయి అంగాంగాలను వర్ణించారని అభ్యంతరం వ్యక్తం చేశారు. వేద సంస్కృతిని, హిందూ సంస్కృతిని అవహేళన చేయకూడదని హితవు పలికారు.