: రేపే శిల్పా మోహన్ రెడ్డి వైకాపాలో చేరిక... ఆ వెంటనే నంద్యాల అభ్యర్థిగా ప్రకటన!
గత కొంత కాలం నుంచి అందరూ అనుకుంటున్నట్టుగానే, తెలుగుదేశం పార్టీ నేత, మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి, ఆ పార్టీకి రాజీనామా చేసి, వైకాపాలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. రేపు వైకాపా అధినేత వైఎస్ జగన్ సమక్షంలో శిల్పా, ఆ పార్టీలో చేరనుండగా, ఆ వెంటనే నంద్యాల ఉప ఎన్నికల్లో తమ పార్టీ నుంచి ఆయన పోటీ చేస్తారని జగన్ ప్రకటించనున్నట్టు తెలుస్తోంది. నంద్యాల ఎమ్మెల్యేగా ఉన్న భూమా నాగిరెడ్డి మరణించి మూడు నెలలు కావడంతో, మరో మూడు నెలల్లో తప్పనిసరిగా ఎన్నికలు జరగాల్సి వుందన్న సంగతి తెలిసిందే. అతి త్వరలో ఎలక్షన్ కమిషన్ నుంచి నోటిఫికేషన్ కూడా వెలువడే అవకాశాలు ఉన్నాయి.
ఈ నేపథ్యంలో నంద్యాల టికెట్ ను భూమా కుటుంబానికే ఇస్తామని చంద్రబాబు అనధికారికంగా స్పష్టం చేయడంతో, ఇంతకాలమూ టికెట్ పై ఆశలు పెట్టుకున్న శిల్పా, పార్టీకి రాజీనామా చేశారు. వైకాపా తరఫున బరిలోకి దిగి విజయం సాధిస్తానని ఆయన అంటుండగా, నంద్యాల ప్రజలు తమ వెంటేనని మంత్రి భూమా అఖిల ప్రియ చెబుతున్నారు. తన పెదనాన్న కుమారుడు భూమా బ్రహ్మానందరెడ్డి నేతృత్వంలో నంద్యాలను మరింతగా అభివృద్ధి చేసి చూపిస్తామని హామీలు ఇస్తూ ప్రజల్లోకి ఆమె వెళుతున్నారు. ఇక ఇంతకాలం నంద్యాల స్థానంపై ఆశలు పెట్టుకున్న ఇతర వైకాపా నేతలు ఏ నిర్ణయం తీసుకుంటారోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.