: ఏంటి.. రోడ్డుపై ఈ తమాషా?: రాంగ్ రూట్ లో వచ్చి, ట్రాఫిక్ సీఐతో గొడవ పెట్టుకున్న మహిళా ఎస్ఐ
విశాఖపట్నంలో రాంగ్ రూట్ లో వస్తున్న ఓ మహిళా ఎస్ఐ, తనను ఆపిన ట్రాఫిక్ సీఐపై దుర్భాషలకు దిగారు. నన్నే ఆపుతారా? అని ప్రశ్నిస్తూ, రోడ్డుపై సీన్ క్రియేట్ చేస్తున్నారని ఆరోపించారు. అందరూ తనను చూస్తున్నారని, దీనికి కారణం మీరేనని అంటూ తిరగబడటం కలకలం రేపింది. మరిన్ని వివరాల్లోకి వెళితే, సీఐఎస్ఎఫ్ మహిళా ఎస్ఐగా ఉన్న మెహరాజ్ బేగం అనే యువతి, తన కుమార్తె, కుమారునితో కలసి టూ వీలర్ పై రాంగ్ రూటులో గాజువాక, శ్రీహరిపురం సమీపంలోని కూరగాయల మార్కెట్ కు వచ్చారు.
ఆ సమయంలో ట్రాఫిక్ పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు మల్కాపురం సీఐ కేశవరావు ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. ఆ సమయంలో మెహరాజ్ బేగం అటువైపుగా రావడంతో వాహనాన్ని ఆపారు. దీంతో ఆ లేడీ ఎస్ఐకి కోపం నషాళానికి అంటింది. నన్నే ఆపుతారా? అంటూ సీఐతో గొడవకు దిగారు. 'నా వాహనాన్ని ఆపి తమాషా చేస్తున్నారా?' అని ప్రశ్నించారు. విషయాన్ని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించింది. ఇద్దరు పిల్లలతో వచ్చారు కాబట్టి వదిలేస్తున్నానని సీఐ చెప్పగా, ఇంకాస్త రెచ్చిపోయింది ఆ లేడీ ఎస్ఐ. ఈ దృశ్యాలన్నీ మీడియా కెమెరాలకు చిక్కాయి.