: గుచ్చి గుచ్చి ఆ చూపులేంటని ప్రశ్నిస్తున్న యువతి... తెలంగాణ డీజీపీ వరకూ వెళ్లిన కానిస్టేబుల్ నిర్వాకం


హైదరాబాద్ లో మహిళలకు పూర్తి భద్రతను కల్పిస్తున్నామని పోలీసు విభాగం మాటలు చెబుతున్నప్పటికీ, కొంతమంది పోలీసుల వైఖరి చెడ్డపేరు తెస్తోంది. తాజాగా, ఫిర్యాదు చేయడానికి స్టేషనుకు వెళ్లిన యువతికి ఎదురైన పరిస్థితిని ఆమె స్వయంగా ట్విట్టర్ ఖాతాలో పెట్టగా, అది వైరల్ అయి చివరికి తెలంగాణ డీజీపీకి చేరింది.

మరిన్ని వివరాల్లోకి వెళితే... వయో వృద్ధుడైన ఓ విశ్రాంత ఇంజనీర్, తన సహాయకుడితో కలసి అపురూప టౌన్ షిప్ లో ఒంటరిగా ఉంటుండగా, ఆయన కుమార్తె అమీర్ పేటలో ఉంటున్నారు. గత నెల 30న ఆయన నిద్రపోతున్న వేళ, సహాయకుడు ఇంట్లో దొంగతనం చేసి పారిపోయాడు. చూసుకునే వారు లేక, ఆ వృద్ధుడు మంచానపడగా, చుట్టుపక్కల వారు కుమార్తెకు విషయం తెలియజేశారు. ఆమె తన తండ్రిని ఆసుపత్రిలో చేర్చగా, కోలుకున్న తరువాత దొంగతనం విషయాన్ని ఆమెకు చెప్పాడు. ఫిర్యాదు చేసేందుకు జీడిమెట్ల పోలీస్ స్టేషన్ కు ఆమె 6వ తేదీన వెళ్లగా, ఘటనా స్థలిని చూడాలని పోలీసులు కోరారు.

దీంతో అపురూప కాలనీలోని తన ఇంటికి సదరు యువతి పోలీసులను తీసుకు వెళ్లింది. ఓ కానిస్టేబుల్ వివరాలు రాసుకుంటుంటే, మరో కానిస్టేబుల్ ఆమె ఛాతీ వైపు గుచ్చి గుచ్చి చూడసాగాడు. దాదాపు 15 నిమిషాల పాటు అతను అదే పనిలో ఉన్నాడు. ఈ విషయాన్ని అదే రోజున బాధితురాలు తెలంగాణ పోలీస్ ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. "జీడిమెట్ల పోలీస్ స్టేషన్ కు చెందిన ఆ కానిస్టేబుల్ నా ఎడమ వక్షోజంపై తదేక దృష్టితో చూశాడు. ఈ పనేంటి?" అని ప్రశ్నించారు.

 ఈ ట్వీట్ వైరల్ కాగా, నాలుగు రోజుల తరువాత బాధితురాలి స్నేహితుడు ఒకరు, డీజీపీ ట్విట్టర్ ఖాతాకు రీ ట్వీట్ చేశారు. దీన్ని చూసిన డీజీపీ సైబరాబాద్ పోలీసులకు ఫార్వార్డ్ చేయగా, ఈ విషయమై ఇప్పటి వరకూ ఎటువంటి చర్యలూ తీసుకున్నట్టు తెలియరాలేదు. కాగా, సదరు యువతి సాయంత్రం 4:30 గంటలకు ఫిర్యాదు చేయడానికి వెళితే, రాత్రి 8:30 వరకూ వెయిటింగ్ లో ఉంచారని కూడా బాధితురాలు వాపోయింది.

  • Loading...

More Telugu News