: బ్యాంకుకు రెండడుగుల కన్నమేసి కోట్లాది రూపాయలు దోచుకుపోయిన దుండగులు!


బ్యాంకులోని స్ట్రాంగ్‌ రూమ్‌కు రెండు అడుగుల మేర రంధ్రం చేసిన దొంగలు 30 లాకర్లను దోచుకుని కోట్లాది రూపాయల విలువైన వస్తువులను దోచుకెళ్లారు. ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్ జిల్లా మోదీనగర్‌లో ఈ ఘటన జరిగింది.  సోమవారం ఉదయం 9:45 గంటల ప్రాంతంలో బ్యాంకు సిబ్బంది బ్యాంకును తెరిచి లాకర్‌ను డోర్లను ఓపెన్ చేసిన తర్వాత గానీ దోపిడీ విషయం బయటపడలేదు. స్ట్రాంగ్ రూమ్‌లోని గ్రిల్స్ వంగిపోయి ఉండడాన్ని గమనించిన సిబ్బంది పూర్తిగా పరిశీలించగా లాకర్లు ఖాళీ అయిన విషయం గుర్తించారు.

30 లాకర్లను దొంగలు కొల్లగొట్టినట్టు బ్యాంకు అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఎస్‌కే పాంచోలి తెలిపారు. బ్యాంకుకు సెక్యూరిటీ గార్డు కూడా ఉన్నాడని, పోలీస్ పెట్రోలింగ్ కూడా నిరంతరం ఉంటుందని ఆయన తెలిపారు. బ్యాంకులో మొత్తం 435 లాకర్లు ఉండగా వాటిలో 30 లాకర్లను దొంగలు తెరిచి దోచుకున్నారు. మరికొన్నిటిని తెరిచేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. పనిలో పనిగా స్ట్రాంగ్ రూమ్‌లో ఉన్న డబుల్ బ్యారెల్ తుపాకిని కూడా దొంగలు ఎత్తుకెళ్లారు. కచ్చితంగా ఎంత మొత్తం దోపిడీకి గురైందన్నది తెలియకపోయినా కోట్లాది రూపాయల విలువైన సొత్తు దోపిడీకి గురైనట్టు చెబుతున్నారు. ఈ ఘటనపై  కేసు నమోదు చేసుకున్న పోలీసులు దొంగల కోసం గాలిస్తున్నారు.

  • Loading...

More Telugu News