: బీఫ్-ఈటింగ్ పార్టీతో హోంమంత్రి రాజ్‌నాథ్‌కు స్వాగతం పలికిన మిజోరం!
కబేళాలకు పశువులను విక్రయించడాన్ని కేంద్రం నిషేధించడాన్ని నిరసిస్తూ మిజోరం ప్రజలు వినూత్న నిరసన తెలిపారు. మయన్మార్‌తో అంతర్జాతీయ సరిహద్దును పంచుకుంటున్న నాలుగు ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించి భద్రతా సమస్యలపై చర్చించేందుకు కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ మిజోరం చేరుకున్నారు. కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న మిజోరం వాసులు ఆయనకు వినూత్నంగా స్వాగతం పలికారు. రాజధాని ఐజ్వాల్‌కు గుండెకాయ వంటి వనాపా హిల్‌లో ‘బీఫ్ బ్యాన్ బాషింగ్ బాంక్వెట్’ పేరుతో పెద్ద పార్టీని ఏర్పాటు చేశారు. భారీ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా వేలాదిమంది హాజరై ప్రభుత్వ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
క్రిస్టియానిటీ ఎక్కువగా ఉండే ఈశాన్య రాష్ట్రాల్లో సగానికంటే ఎక్కువ శాతం మంది మాంసాహారులే. అందుకే ప్రభుత్వ నిర్ణయాన్ని ఆ రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఎన్ఎస్ఎస్‌వో 2015లో విడుదల చేసిన లెక్కల ప్రకారం.. మేఘాలయలో 81 శాతం మంది మాంసాహారులే. కాగా, ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ‘బీఫ్ ఈటింగ్ ప్రొటెస్ట్’ను నిర్వహించింది బీజేపీ మాజీ నేతలే కావడం గమనార్హం.