: తాత ఇంటికే కన్నమేసిన మనవడు.. ముసుగు వీరుల్లా దోపిడీ ప్రయత్నం.. ఆటకట్టించిన 80 ఏళ్ల వృద్ధుడు!


ఆస్తి అమ్మగా వచ్చిన డబ్బులు ఇంట్లో ఉన్న విషయం తెలిసిన మనవడు వాటిని కొట్టేయాలని ప్లాన్ వేసి చివరికి తాత చేతిలో అడ్డంగా బుక్కయ్యాడు. సొంత ఇంటికే కన్నమేయడానికి వచ్చిన మనవడిని చూసి తాత కంగుతిన్నాడు. ఢిల్లీలో జరిగిందీ ఘటన. ఢిల్లీలోని రోహిణీ సెక్టార్ 7లో రామ్‌లాల్ మిగ్‌లానీ (80), భార్య శకుంతల (70)లతో కలిసి జీవిస్తున్నారు. ఇటీవల రామ్‌లాల్ ఆస్తి అమ్మగా వచ్చిన రూ.50 లక్షలను ఇంట్లోనే దాచిపెట్టారు. విషయం తెలిసిన మెడిసిన్ చదువుతున్న ఆయన మనవడు రజత్ (21) ఆ సొమ్మును కొట్టేయాలని ప్లాన్ వేశాడు.

శనివారం మధ్యాహ్నం స్నేహితుడు రిషబ్ (22)తో కలిసి బొమ్మ తుపాకి, సుత్తి పట్టుకుని, తలకు హెల్మెట్లు ధరించి తాత ఇంట్లోకి ప్రవేశించాడు. నేరుగా బెడ్రూములోకి ప్రవేశించి శకుంతల తలపై సుత్తితో కొట్టారు. దీంతో ఆమె తీవ్రంగా గాయపడింది. ఆ వెంటనే తేరుకుని రక్షించమంటూ కేకలు వేసింది. భార్య అరుపులకు లోపలకు వచ్చిన రామ్‌లాల్‌ అక్కడి దృశ్యాన్ని చూసి షాక్ తిన్నారు. భార్య తలకు తుపాకి గురిపెట్టిన దుండగులు లాకర్ తాళాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆయన తాళాలు ఇస్తున్నట్టు నటించి దుండగుడి చేతిని బలంగా కొట్టాడు.

 దీంతో అతడి చేతిలోని తుపాకి దూరంగా పడింది. రామ్‌లాల్ వెంటనే రక్షించమంటూ పెద్దగా కేకలు వేశారు. అతడి అరుపులు విన్న సెక్యూరిటీ గార్డు, చుట్టుపక్కల వారు పరిగెత్తుకుంటూ ఇంట్లోకి వచ్చారు. స్కూటర్‌పై పారిపోయేందుకు ప్రయత్నించిన వారిని పట్టుకున్నారు. అనంతరం వారి హెల్మెట్లు తీసి చూడగా రామ్‌లాల్ అవాక్కయ్యారు. వారిలో ఒకడు తన మనవడు రజత్ కావడంతో షాక్ తిన్నారు. తనను చావబాదుతున్న వారి నుంచి రక్షించమంటూ రజత్ తాతను వేడుకున్నాడు. అప్పటికే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితులను అరెస్ట్ చేశారు. తీవ్రంగా గాయపడిన శకుంతలను ఆస్పత్రికి తరలించారు.

  • Loading...

More Telugu News