: శ్రీలంకపై గెలిచి చాంపియన్స్ ట్రోఫీ సెమీస్‌కు దూసుకెళ్లిన పాక్!
తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో పాకిస్థాన్ రెచ్చిపోయి ఆడింది. బౌలింగ్, బ్యాటింగ్ రంగాల్లో సత్తా చాటి శ్రీలంకపై ఘన విజయం సాధించి చాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్‌లోకి దూసుకెళ్లింది. గ్రూప్-బిలో రెండోస్థానంలో నిలిచి ఇంగ్లండ్‌తో పోరుకు సిద్ధమైంది. కార్డిఫ్‌లో సోమవారం జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక నిర్దేశించిన 237 పరుగుల విజయ లక్ష్యాన్ని మరో 31 బంతులు మిగిలి ఉండగానే 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్లు అజర్ అలీ (34), ఫకర్ జమాన్ (50) బలమైన పునాదులు వేయగా తర్వాత కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ (61) కెప్టెన్ ఇన్నింగ్స్‌తో జట్టుకు విజయాన్ని అందించి పెట్టాడు. ఓ దశలో 162 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టుకు మొహమ్మద్ ఆమిర్ (28)తో కలిసి అపూర్వ విజయాన్ని అందించాడు. శ్రీలంక బౌలర్లలో నువాన్ ప్రదీప్ 3, మలింగ, లక్మల్, పెరీరా చెరో వికెట్ తీసుకున్నారు.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 49.2 ఓవర్లలో 236 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్ నిరోషన్ డిక్‌వెల్లా (73), కుశాల్ మెండిస్ (27), మాధ్యూస్ (39), గుణరత్నే (27), లక్మల్ (26) మినహా మరెవరూ చెప్పుకోదగ్గ పరుగులు చేయలేదు. పాక్ బౌలర్లలో జునైద్ ఖాన్, హసన్ అలీ చెరో మూడు వికెట్లు నేల కూల్చగా మొహమ్మద్ ఆమిర్, ఫహీమ్ అష్రాఫ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.