: విమానానికి రంధ్రం.. ప్రయాణికుల బేజారు.. తప్పిన పెను ప్రమాదం!
గాల్లో ఉండగానే ఓ విమానానికి భారీ రంధ్రం పడింది. దీంతో ఆ విమానంలోని ప్రయాణికులు తీవ్ర ఆందోళన చెందారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని దేవుడిని ప్రార్థించారు. చివరికి ఫైలట్ ఆ విమానాన్ని చాకచక్యంగా దించడంతో ప్రమాదం తప్పింది. చైనా ఈస్ట్రన్ సంస్థకు చెందిన ప్యాసెంజర్ విమానం నిన్న రాత్రి 8:30 గంటలకు సిడ్నీ ఎయిర్‌పోర్టు నుంచి బయల్దేరింది. గాల్లో ఉండగా ఇంజిన్ కేసింగ్స్‌కి భారీ రంధ్రం పడి పెద్ద పెద్ద శబ్దాలు, కాలిపోయిన వాసన వచ్చాయి. ఇంజిన్ వైపు ఉన్న సీట్లలోని ప్రయాణికులను ఖాళీ చేయించి, ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసం విమానాన్ని వెనక్కి తిప్పి, గంటసేపటి తర్వాత సిడ్నీ ఎయిర్ పోర్టులో దించారు. ఈ సందర్భంగా ప్రయాణికులు చెబుతూ, తమ గుండె జారినంత పనయ్యిందని అన్నారు. ఈ ఘటనపై అధికారులు విచారణ ప్రారంభించారు.