: పనికిరాదంటూ ఆ కుక్కను గెంటేశారు.. ఆ తర్వాత దానికి గవర్నర్ బంగ్లాలో ఉద్యోగం వచ్చింది!
జర్మన్ షెపర్డ్ జాతికి చెందిన గావెల్ అనే శునకానికి ట్రైనింగ్ ఇచ్చిన పోలీసులు.. చివరకు అది పనికిరాదంటూ పంపించేశారు. కానీ, అదృష్టం బాగుండి అంతకంటే మంచి ఉద్యోగాన్ని సంపాదించింది. క్వీన్‌లాండ్ గవర్నర్ అధికారిక నివాసానికి చెందిన అధికారులు ఆ కుక్కకు క్వీన్‌లాండ్ అధికారిక శునకంగా ఉద్యోగం ఇవ్వడంతో అది ఎంచక్కా తన ఉద్యోగ బాధ్యతలను నిర్వర్తిస్తూ హాయిగా గడుపుతోంది. మరిన్ని వివరాల్లోకి వెళితే, ముందుగా ఆ గ్రామసింహం పోలీసుల వద్ద బాంబులను గుర్తించే శిక్షణను తీసుకుంది. కానీ, పోలీసులు చెప్పిన మాటలను అంతగా పట్టించుకోకుండా తన ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించేది. కొత్తవారు కనిపిస్తే వారి దగ్గరకు వెళ్లిపోయేది.
దీంతో పోలీసు జాగిలంగా అది పనికిరాదని అధికారులు దాన్ని బయటకు పంపించేశారు. ఈ విషయం తెలుసుకున్న క్వీన్‌లాండ్ గవర్నర్ అధికారిక నివాసం అధికారులు దానికి ఉద్యోగం ఇవ్వడంతో అది ఇప్పుడు అక్కడ హాయిగా ఉంటోంది. గవర్నర్ బంగ్లాలో నివాసముంటూ అక్కడికి వచ్చే వారికి స్వాగతం పలుకుతోంది.