: సినారే పొందిన పదవులు, ఆయన్ను వరించిన అవార్డులు!


విద్యాత్మకంగా, పాలనా పరంగా సింగిరెడ్డి నారాయణరెడ్డి ఎన్నో పదవులను అలంకరించి, వాటికి వన్నె తెచ్చారు. దివంగత ఎన్టీఆర్ తో పరిచయం ఆయన్ను సినీ రంగంలో నిలదొక్కుకునేలా చేయగా, తన అపారమైన విజ్ఞానంతో ఎంతో కీర్తిని అందుకున్నారు.  1981లో సినారేను అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికార భాషా సంఘం అధ్యక్షులుగా నియమించింది. ఆపై 1985 నుంచి 1989 వరకూ అంబేద్కర్ విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులుగా, ఆ తరువాత 1989 నుంచి 1992 వరకూ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులుగా, ఆ తరువాత ఆంధ్ర ప్రభుత్వ సాంస్కృతిక వ్యవహారాల సలహాదారుగా, రాష్ట్ర సాంస్కృతిక మండలి అధ్యక్షుడిగా తన సేవలను అందించారు.

1997లో రాష్ట్రపతి నామినేట్ చేయగా, రాజ్యసభలో కాలుమోపిన ఆయన ఎన్నో ప్రసంగాలు చేసి సభ్యుల మన్ననలను అందుకున్నారు. 1993 నుంచి అంధ్ర సారస్వత పరిషత్తు అధ్యక్షుడిగా కొనసాగిన ఆయన, ఎన్నో విలక్షణ కార్యక్రమాలు రూపొందించి తెలుగు భాషా సాహిత్య, సాంస్కృతిక అభ్యుదయానికి తోడ్పడ్డారు. ఉస్మానియా విశ్వవిద్యాలయము నుండి తెలుగు సాహిత్యంలో డాక్టరేట్ డిగ్రీ పొందిన ఆయన, ఆపై ఎన్నో వర్శిటీల నుంచి గౌరవ డాక్టరేట్లు పొందారు. 1988లో ప్రతిష్ఠాత్మకమైన జ్ఞానపీఠ పురస్కారం సినారేకు దక్కింది. 'సీతయ్య' చిత్రంలో ఇదిగో రాయలసీమ గడ్డ... అంటూ ఆయన రాసిన పాటకు నంది అవార్డు లభించింది. ఇటీవలే ఆయన్ను డా. బోయి భీమన్న జీవన సాఫల్య పురస్కారం ఇచ్చి సత్కరించారు. వీటితో పాటు పలు అవార్డులు, రివార్డులను అందుకున్న ఆయన తెలుగువారి గౌరవ ప్రతిష్ఠలను ఇనుమడింప చేశారనడంలో సందేహం లేదు.

  • Loading...

More Telugu News