: అక్కడ కేజీ ఉప్పు 150, కేజీ పంచదార 200...ఇక పప్పు సంగతి అడక్కండి!
మామూలుగా కేజీ ఉప్పు 18 నుంచి 20 రూపాయలు, కేజీ పంచదార 42 నుంచి 45 రూపాయలు. అలాంటిది అక్కడ మాత్రం కేజీ ఉప్పు 150 రూపాయలు కాగా, కేజీ పంచదార 200 రూపాయలు. ఇక పప్పులు, ఇతర నిత్యావసర సరకుల ధరల సంగతి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఎందుకంటే, ఆ ధరలు ఆకాశాన అంటి ఉంటాయి. ఇంతకీ ఈ ధరలు ఎక్కడో ఆఫ్రికా దేశాల్లో కాదు. మన దేశంలోనే అంటే ఆశ్చర్యం కలగకమానదు. మన దేశంలోని భారత్- మయన్మార్ సరిహద్దుల్లో అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని విజయ్ నగర్ గ్రామంలో ఈ ధరలు ఉన్నాయి. 300 కుటుంబాలు నివాసముండే ఈ గ్రామం దట్టమైన అడవుల్లో 8,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. ఈ రెండు దేశాల మధ్య సరిహద్దులు నిర్ణయించక ముందు అస్సాం రైఫిల్స్ కు చెందిన సైనికుల కోసం 200 కుటుంబాలు నివసించేలా ఏర్పాటు చేశారు.
దేశభద్రత నిమిత్తం 1971లో పదవీ విరమణ పొందిన సైనికులను అక్కడ ఉండాలని, అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అయితే 1972లో ఈ రెండు దేశాల మధ్య సరిహద్దులు నిర్ణయించారు. దీంతో రోడ్లు, రవాణా, సమాచార, విద్యుత్, విద్య వంటి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇన్నేళ్లు గడిచినా ఇచ్చిన హామీల అమలుకు నోచుకోలేదు. అక్కడి నుంచి ఫోన్ చేయాలంటే నిమిషానికి 5 రూపాయలు. ఇక అనారోగ్యం చేస్తే 200 కిలోమీటర్ల దూరంలోని ఆసుపత్రికి హెలికాప్టర్ లో వెళ్లాలి. దీంతో ఆ చుట్టుపక్కల దొరికే పసరు మందులతోనే వైద్యం చేసుకుంటారు. ఇప్పటికైనా ఆ గ్రామానికి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని మాజీ సైనికులు డిమాండ్ చేస్తున్నారు.