: దండుమైలారం భుములు కొన్నాం...శంషాబాద్ లో నాకు సెంటు భూమి కూడా లేదు: కేకే
దండుమైలారం, శంషాబాద్ ప్రాంతాల్లో ఎంపీ కేకే అక్రమంగా భూములు కొనుగోలు చేశారంటూ వార్తలు రావడంపై ఆయన స్పందించి, వివరణ ఇచ్చారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీం పట్నం పరిధిలోని దండుమైలారం గ్రామంలో 50 ఎకరాల భూమిని తన కుటుంబ సభ్యులు కొనుగోలు చేశారని అన్నారు. అయితే శంషాబాద్ లో తనకు సెంటు భూమి కూడా లేదని ఆయన స్పష్టం చేశారు. కొంతమంది తన కుమార్తె ఫోటో పెట్టి మీడియాలో వార్తలు రాశారని, అవన్నీ అవాస్తవాలని ఆయన చెప్పారు. తాను కాంగ్రెస్ లో ఉండగా, దండు మైలారం భూములు కొనుగోలు చేశామని ఆయన చెప్పారు. భూములు చట్టప్రకారం కొనుగోలు చేశామని ఆయన అన్నారు. అన్ని పత్రాలు సరిచూసుకున్న తరువాతే తాము భూములు కొన్నామని ఆయన చెప్పారు.