: పాము బారి నుంచి ముసలమ్మను కాపాడిన శునకం!
చావు పుట్టుకలనేవి మన చేతుల్లో ఉండవు అన్న పెద్దల మాట వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలోని బోల్లోనిపల్లెలో రుజువైంది. ఘటన వివరాల్లోకి వెళ్తే... గండు సుగుణమ్మ(65) భర్త కొమ్మయ్య రెండేళ్ల క్రితం మృతి చెందాడు. ముగ్గురు కుమార్తెలకు వివాహాలు జరగడంతో వారు వెళ్లిపోయారు. దీంతో ఆమె ఒంటరిగా ఉంటోంది. అంతే కాకుండా వయసు మళ్లడంతో అనారోగ్యం కూడా ఆమెను పీడిస్తోంది. దీంతో బతకాలన్న ఆశ నశించి, ఆత్మహత్య చేసుకుందామని గ్రామంలోని వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. అయితే ఆమె దూకిన నూతిలో నీరు తక్కువగా ఉండడంతో ఆమె ఆశించనది జరగక, తీవ్రంగా గాయపడింది. మరోవైపు అంతకు రెండు రోజుల ముందు ఆ నూతిలో ఒక నాగుపాము పడి తిరుగుతోంది.
ఆమె దూకడానికి ముందు అదే గ్రామానికి చెందిన సాద మల్లయ్య పెంపుడు కుక్క ప్రమాదవశాత్తు అందులో పడిపోయింది. దీంతో ఆమె ఆ రాత్రంతా నాగుపాము, కుక్కతో కలిసి నూతిలో గడిపింది. తెల్లవారిన తరువాత చిన్న అలికిడి కావడంతో రక్షించమంటూ నూతిలోంచి అరిచింది. దీంతో గ్రామస్థులు వచ్చి, పోలీసులకు సమాచారమిచ్చి, నూతిలోకి మంచాన్ని దించారు. ఈ అలజడికి బెదిరిపోయిన నాగుపాము ఆమెను కాటేసేందుకు బుసలు కొడుతూ రెండు సార్లు ఆమె మీదికి దూకింది. అయితే ఈ రెండు సార్లు ఎవరూ ఊహించని విధంగా కుక్క పాము మీదకి దూకి దానిని నోట కరిచి, విసిరికొట్టింది. ఈ క్రమంలో ఒక కాటు కుక్కకు పడింది. ఇంతలో స్థానికులు సుగుణమ్మతో పాటు, కుక్కను కూడా బయటకు తీశారు. ఆమెతోపాటు కుక్కకు కూడా వైద్యమందించారు.