: ఎట్టకేలకు వైట్ హౌస్ కు అతివ కళ... ట్రంప్ వద్దకు వచ్చేస్తున్న మెలానియా!
అమెరికాకు అధ్యక్షుడిగా ఎన్నికైన నాటి నుంచి వైట్ హౌస్ లో ఆడతోడు లేకుండా ఉంటున్న డొనాల్డ్ ట్రంప్ ఇకపై తన జీవిత భాగస్వామితో కలసి వుండనున్నారు. ఇన్ని రోజులూ కొడుకు చదువు పేరిట భర్తకు దూరంగా ఉన్న ఒకప్పటి అందాల మోడల్, నేటి యూఎస్ ఫస్ట్ లేడీ మెలానియా శ్వేత సౌధానికి రానున్నారు. న్యూయార్క్ లోని ట్రంప్ టవర్స్ లో ఉంటున్న మెలానియా, కొడుకు చదువు పూర్తి కావడంతో వైట్ హౌస్ కు వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది.
కాగా, ఇటీవలి ట్రంప్ విదేశీ టూర్లలో మెలానియా వైఖరి వారిద్దరి మధ్యా విభేదాలు ఉన్నట్టు అనుమానాలను రేకెత్తించిన సంగతి తెలిసిందే. సౌదీలో, రోమ్ లో ట్రంప్ చెయ్యి అందించినా, దాన్ని అందుకోకుండా అంటీ ముట్టనట్టు మెలానియా వ్యవహరించడంతో, అమెరికన్లు సైతం అవాక్కయ్యారు. ఇక తమ మధ్య విభేదాలు లేవని చెప్పేందుకు జూన్ 14న ట్రంప్ పుట్టినరోజు నాటికి ఆమె వైట్ హౌస్ కు వచ్చేస్తారని, తద్వారా తమ బంధంపై నెలకొన్న అనుమానాలను ఆమె తీరుస్తారని సమాచారం.