: లిబియాలో మరో విషాదం: పడవ మునిగి 10 మంది వలసదారుల మృతి.. 100 మంది గల్లంతు!
లిబియాలో మరో మారు విషాదం చోటుచేసుకుంది. వలసదారులతో వెళ్తున్న పడవ లిబియా తీరంలో మునిగిపోయింది. ఈ ఘటనలో 10 మంది మృతి చెందగా 100 మంది గల్లంతైనట్టు తీర రక్షక దళం అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు 8 మృతదేహాలను బయటకు తీశారు. ప్రమాదానికి గురైన సమయంలో పడవలో 120 మంది ఉన్నట్టు అధికారులు తెలిపారు.
లిబియాలో సంక్షోభం కారణంగా వేలాదిమంది శరణార్థులు మరింత మెరుగైన జీవనం కోసం ఆ దేశాన్ని వీడి యూరప్ చేరుతున్నారు. ఏడాది కాలంలోనే 61,250 మంది మధ్యధరా సముద్రం దాటినట్టు ఐక్యరాజ్య సమితి పేర్కొంది. వీరిలో 1800 మంది చనిపోవడమో, గల్లంతవడమో జరిగిందని తెలిపింది. కాగా, ఇటాలియన్ కోస్ట్‌గార్డ్ అధికారులు మాట్లాడుతూ లిబియా నుంచి వచ్చిన 1650 మంది వలసదారులను రక్షించినట్టు తెలిపారు. వారికి సాయం అందిస్తున్నట్టు పేర్కొన్నారు. గురు, శుక్రవారాల్లోనే 900 మంది వలసదారులను రక్షించినట్టు ఇటలీ తీర రక్షక దళం పేర్కొంది. మరోవైపు సముద్రంలో గల్లంతైన వారి కోసం లిబియా రక్షక దళాలు గాలిస్తున్నాయి.