: ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం.. నెల రోజుల బంద్‌కు పిలుపు.. అట్టుడుకుతున్న డార్జిలింగ్!
ప్రత్యేక రాష్ట్రం కోసం జరుగుతున్న పోరాటంతో చల్లని డార్జిలింగ్ వేడెక్కింది. గూర్ఖాలాండ్ కోసం పోరాడుతున్న గూర్ఖాలాండ్ జన్‌ముక్తి మోర్చా (జీఏఎం) సోమవారం నుంచి నెల రోజుల పాటు బంద్‌కు పిలుపునిచ్చింది. ప్రభుత్వం దిగొచ్చేంత వరకు ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు, పౌర సేవా కేంద్రాలను మూసివేయాలని పిలుపు నిచ్చింది. మమతా బెనర్జీ ప్రభుత్వానికి సహాయ నిరాకరణ చేయాలని జీజేఎం కోరింది. గురువారం జీజేఎం మద్దతుదారులు పోలీసులపై రాళ్లు రువ్వారు. పోలీసు వాహనాలు, బస్సులపై బాంబులు విసిరారు.
దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాట్లాడుతూ ఆందోళనకారుల చర్యలను ఖండించారు. ఇటువంటి చర్యలను ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. తమ తప్పులను కప్పి పుచ్చుకునేందుకే బాంబులు విసురుతున్నారని, రాళ్లు రువ్వుతున్నారని, బంద్‌కు పిలుపునిస్తున్నారని ఆరోపించారు. ప్రజలు సహనం పాటించాలని కోరారు.
కాగా, శనివారం జీజేఎం జనరల్ సెక్రటరీ రోషన్ గిరి మాట్లాడుతూ ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నెల రోజుల పాటు బంద్‌కు పిలుపునిస్తున్నట్టు పేర్కొన్నారు. ప్రభుత్వ కార్యాలయాలను తెరవనిచ్చేది లేదన్నారు. వారానికి రెండు రోజులు సోమవారం, గురువారం మాత్రమే బ్యాంకులు తెరిచేందుకు అనుమతిస్తామని పేర్కొన్నారు. విద్యాసంస్థలు, రవాణా, కోర్టులు, విద్యుత్ తదితర వాటికి బంద్ నుంచి మినహాయింపు ఇస్తున్నట్టు వివరించారు.