: ఏపీకి డబ్బు కట్టని తెలంగాణ... నేటితో విద్యుత్ బంధం కట్!
ఆంధ్రప్రదేశ్ నుంచి విద్యుత్ ను వాడుకుంటున్న తెలంగాణ చెల్లించాల్సిన బకాయిలను చెల్లించకపోవడంతో తెలుగు రాష్ట్రాల మధ్య విద్యుత్ బంధం నేటితో తెగిపోనుంది. ఆదివారం నుంచి ఎవరి విద్యుత్ ను వారే వినియోగించు కోవాల్సిన పరిస్థితి. ఈ వివాదం సద్దుమణిగే అవకాశం లేకపోవడం, తెలంగాణ ప్రభుత్వం డబ్బు కట్టే పరిస్థితి లేకపోవడంతో, అధికారికంగా తెలంగాణకు విద్యుత్ సరఫరాను అధికారులు నిలిపివేశారు.
విభజన చట్టం ప్రకారం, ఏపీలోని విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నుంచి తెలంగాణకు 1200 మెగావాట్ల చొప్పున సరఫరా కాగా, తెలంగాణ నుంచి ఏపీకి 800 మెగావాట్ల వరకూ విద్యుత్ వెళ్లింది. ఏపీ అదనంగా అందించిన 400 మెగావాట్ల విద్యుత్ కు సుమారు రూ.4,491 కోట్లను తెలంగాణ చెల్లించాల్సి వుండగా, ఈ మొత్తం వెంటనే ఇవ్వాలని ఏపీ గత వారంలోనే టీఎస్ జెన్ కోకు తాఖీదులు పంపిన సంగతి తెలిసిందే. ఈ డబ్బుతో పోలవరం ప్రాజెక్టులో జల విద్యుత్ కేంద్రం నిర్మించవచ్చని అధికారులు చెబుతున్నారు. ఏపీ నుంచి తెలంగాణకు విద్యుత్ సరఫరాను నిలిపివేయడం ద్వారా 456 మెగావాట్ల వరకూ అందుబాటులోకి వచ్చే విద్యుత్ ను రైతుల అవసరాలకు వినియోగించాలని ప్రభుత్వం భావిస్తోంది.