: కారులో పిల్లల్ని వదిలేసి ప్రియుడితో వెళ్లిన యువతి.. ఊపిరాడక చనిపోయిన చిన్నారులు
అమెరికాలోని టెక్సాస్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ తల్లి నిర్లక్ష్యానికి ఇద్దరు చిన్నారులు ఊపిరాడక నరకయాతన అనుభవించి ప్రాణాలు కోల్పోయారు. తన ప్రియుడితో కలిసి ఓ ఇంట్లోకి వెళ్లిన ఆ తల్లి, తన పిల్లల్ని కారులోనే వదిలేయడంతో ఈ విషాదం చోటుచేసుకుంది. కారులో పిల్లలను వదిలేసి వెళ్లిన 15 గంటల తరువాత కారువద్దకి వచ్చి చూసిన ఆ 22 ఏళ్ల యువతికి ఆ కారులో తన పిల్లలు చనిపోయారని తెలిసింది. స్థానికులు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ తల్లిని అరెస్టు చేశారు.
ఇటీవల జరిగిన ఈ ఘటనపై అక్కడి పోలీసులు మాట్లాడుతూ... అమాండా హకిన్స్ అనే మహిళకు రెండు సంవత్సరాల వయసున్న ఇద్దరు కవల ఆడపిల్లలు ఉన్నారని, ప్రియుడితో కలిసి అమాండా పార్క్‌కి వెళ్లిందని చెప్పారు. ఆ సమయంలో ఆమె తన పిల్లలను కూడా తీసుకెళ్లిందని అన్నారు. అనంతరం తన ప్రియుడితో కలిసి మద్యం తాగి, ఓ రూమ్‌లోకి వెళ్లిందని చెప్పారు. 15 గంటల తరువాత కారులో తన పిల్లలను చూసిన అమాండా వారిని కనీసం ఆసుపత్రికి కూడా తీసుకెళ్లలేదని, వారు చనిపోతే తనకు శిక్ష పడుతుందని భయపడిందని చెప్పారు. స్థానికులు తమకు సమాచారం అందించారని పోలీసులు అన్నారు.