: దాసరికి మనం ఇచ్చే నివాళి అదే!: ఆర్.నారాయణమూర్తి
ఇటీవల మృతి చెందిన దర్శకుడు దాసరి నారాయణరావుకు నివాళి తెలుపుతూ హైదరాబాద్‌లోని ఫిల్మ్ ఛాంబర్‌లో ఈ రోజు సంస్మరణ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నటుడు ఆర్.నారాయణ మూర్తి మాట్లాడుతూ... తానో సామాన్య రైతు బిడ్డనని చెప్పారు. తానూ ఓ సినిమా హీరోని కావాలని, అందరితో చప్పట్లు కొట్టించుకోవాలని అనుకున్నానని చెప్పారు. తాను అదే ఆశయంతో మద్రాసు వెళ్లానని చెప్పారు. అయితే, తనలాగే సినిమాలో వేషాల కోసం ఎంతో మంది మద్రాసులో తిరుగుతున్నారని తెలుసుకొని వామ్మో అని అనుకున్నానని అన్నారు.
ఎన్నో కష్టాలు పడ్డానని, ఓ రోజు దాసరి నారాయణ రావు వద్దకు వెళ్లి సినిమా ఛాన్స్ అడిగానని చెప్పారు. దాసరితో తాను ఇంటర్మీడియట్ అయిపోయిందని చెప్పానని అన్నారు. అప్పుడు దాసరి బీఏ పాసైన తరువాత రావాలని చెప్పారని అన్నారు. ఆ తరువాత తాను బీఏ చదివేసి మూడేళ్ల తరువాత మళ్లీ దాసరి వద్దకు వెళ్లానని చెప్పారు. కృష్ణగారి అబ్బాయితో తీసిన 'నీడ' సినిమాలో తనకు రెండో హీరోగా దాసరి ఛాన్స్ ఇచ్చారని తెలిపారు. మద్రాసు వెళ్లిన తనను కులం, మతం వంటి ఏ వివరాలూ అడగకుండా దాసరి ఛాన్స్ ఇచ్చారని నారాయణమూర్తి అన్నారు. దాసరి నారాయణరావు దర్శకుడిగానే కాకుండా, నటుడిగా, రచయితగా, గీత రచయితగా ఎన్నో బాధ్యతలు నిర్వర్తించారని ఆయన అన్నారు. ఆయన తన కళ్ల ముందు ఎప్పటికీ కనిపిస్తూనే ఉంటారని నారాయణమూర్తి చెప్పారు.
దాసరికి దాదాసాహెబ్ పాల్కే అవార్డు ప్రకటించాలని ఆయన అన్నారు. ఒక నటుడి కుమారుడు హీరో కావచ్చని, కోట్లు ఉన్న వ్యాపారి కొడుకు హీరో కావచ్చని తప్పులేదని, అయితే, సినిమా యాక్టర్ కావాలనుకునే ఆశ పేదలకు కూడా ఉంటుందని అన్నారు. పేదవారికి కూడా యాక్టర్, డైరెక్టర్ కావాలని ఉంటుందని, దాసరి అటువంటి వారికి అవకాశాలు ఇచ్చారని తెలిపారు. ఆయన మార్గంలోనే ఇప్పటి దర్శకులు, నిర్మాతలు నడవాలని, అదే మనం దాసరికి ఇచ్చే నివాళి అని ఆయన అన్నారు.