: తప్పు చేసిన వారిని శిక్షించడం తప్పా?: చెవిరెడ్డి
అధికార పార్టీకి వత్తాసు పలుకుతున్న అధికారులను, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటాడతామంటూ వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై ఉద్యోగ సంఘాల నేతలు మండిపడ్డారు. ఈ నేపథ్యంలో, ఈరోజు హైదరాబాదులోని ప్రెస్ క్లబ్ లో చెవిరెడ్డి మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఉద్యోగులతో తాను ఎలా వ్యవహరిస్తానో తన నియోజకవర్గానికి వచ్చి అడగాలంటూ ఆయన సూచించారు. తప్పు చేసిన అధికారులను శిక్షించడం తప్పా? అని ప్రశ్నించారు. తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడే ఉన్నానని చెప్పారు. తాను చేసిన వ్యాఖ్యలు ఉద్యోగులందరినీ ఉద్దేశించి చేసినవి కాదని అన్నారు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న వారి గురించే తాను వ్యాఖ్యానించానని చెప్పారు. తనకు ఓట్లు వేసిన వృద్ధులకు పెన్షన్లను తీసేస్తే చూస్తూ ఊరుకోమంటారా? అని ప్రశ్నించారు.