: స్మార్ట్ ఫోన్‌లో ఛాటింగ్ చేస్తూ నడుస్తోంది.. గోతిలో పడిపోయింది!
ఇటీవలే ముంబైలో ఓ అమ్మాయి ఫోన్‌లో తన స్నేహితురాలితో మాట్లాడుతూ వెళుతూ గూడ్సు రైలు వస్తుండటాన్ని గమనించకుండా వెళ్లి దాని కింద పడిపోయిన సంగతి దేశ వ్యాప్తంగా వైరల్ అయిన విషయం తెలిసిందే. ఇటువంటి ఘటనలే ప్రపంచ వ్యాప్తంగా ప్రతిరోజూ ఎక్కడోచోట జరుగుతున్నప్పటికీ సెల్ ఫోన్ యూజర్లు ఏ మాత్రం జాగ్రత్తగా వ్యవహరించడం లేదు. తాజాగా అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రంలోనూ ఇటువంటి ఘటనే జరిగింది. స్మార్ట్‌ఫోన్‌లో ఛాటింగ్ చేసుకుంటూ వెళుతున్న ఓ మహిళ... తాను వెళుతున్న దారిలో తెరిచి ఉన్న ఓ బేస్‌మెంట్ డోర్లను గమనించకుండా ఒక్కసారిగా అందులో పడిపోయింది. ఆ గొయ్యి 6 అడుగుల లోతు ఉంది. ఆమె అందులో పడిపోవడాన్ని గమనించిన స్థానికులు రెస్క్యూ సిబ్బందికి సమాచారం అందించారు. సహాయక సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకొని అందులోంచి ఆమెను బయటకు లాగారు. గాయాలపాలైన ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు.