: పేరు మార్చారు.. ప్రాణం తీసుకున్నారు!


సరబ్ జిత్ ఆత్మ ఇప్పటికే అనంతవాయువుల్లో కలిసిపోయింది. కానీ, పాకిస్థాన్ చేసిన పెద్ద తప్పు మాత్రం ఎప్పటికీ పెద్ద దోషంలా చరిత్రలో మిగిలిపోతుంది. "నేను అమాయకుడిని, నాకే పాపం తెలియదు.. నా పేరు సరబ్ జిత్ సింగ్. మాది భారత్ లోని పంజాబ్ రాష్ట్రంలో పాక్ సరిహద్దు గ్రామం. తాగిన మైకంలో గుర్తించలేని స్థితిలో మీ దేశంలో అడుగుపెట్టాను" అని నెత్తీ నోరు బాదుకున్నాడు అమరవీరుడు సరబ్ జిత్ సింగ్. కానీ పాక్ లో ఒక్కరికీ.. ఆఖరికి అక్కడి న్యాయమూర్తులకూ మన సరబ్ జిత్ తీవ్రవాది మంజిత్ సింగ్ లానే కనిపించాడు. కాదు అలా చిత్రించారు. కరుడుగట్టిన భారత ఉగ్రవాదిగా ముద్రవేసి మరణశిక్ష విధించి పెద్ద తప్పు చేశారు. ఇప్పుడు జైల్లో తోటి ఖైదీలు ప్రాణం తీసుకున్నారు.

సరబ్ 26 ఏళ్ల వయసులో 1990లో పాక్ భూభాగంలోకి అడుగుపెట్టి అక్కడి భద్రతాదళాలకు పట్టుబడ్డాడు. పాక్ లోని లాహోర్, ముల్తాన్ పట్టణాల్లో పేలుళ్లు జరిగి 14 మంది మరణానికి కారణమైన కేసులో భారత్ కే చెందిన మంజిత్ సింగ్ ను నిందితుడిగా అక్కడి పోలీసులు భావిస్తున్నారు. 'ఎవరైతేంటి దొరికాడులే' అన్నట్లు పట్టుబడ్డ సరబ్ జిత్ ను కాస్తా మంజిత్ సింగ్ గా మార్చేశారు. తీసుకెళ్లి న్యాయస్థానంలో నిలబెట్టారు. సరబ్ జిత్, అతడి కుటుంబ సభ్యులు, లాయర్లు, అతడి గుర్తింపును తెలిపేలా ఎన్ని పత్రాలు చూపినా, ఎంతగా చెప్పినా వినిపించుకోకుండా ఉగ్రవాది మంజిత్ సింగ్ గానే పరిగణించి మరణశిక్షను ఖరారు చేశారు. దారుణమైన విషయం ఏమిటంటే, సరబ్ జిత్ జిన్నా ఆస్పత్రిలో మరణించిన తర్వాత కూడా ఉగ్రవాది మంజిత్ సింగ్ మరణించాడనే పాక్ అధికారులు ప్రకటించారు. ఏమైతేనేం, ఇక సరబ్ కు తన పేరుతో కానీ, ఈ లోకంతో కానీ సంబంధం లేదు!

  • Loading...

More Telugu News