: రూ.15 లక్షల విలువైన జుట్టు దొంగతనం కేసులో నిందితుడి అరెస్ట్
రూ.15 లక్షల విలువైన జుట్టు దొంగతనం కేసులో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చెన్నైలోని అన్నై సత్యానగర్‌కు చెందిన ఎన్.వెంకట్రామన్ ఇటీవల ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యేసుబాబు నుంచి జుట్టు కొనుగోలు చేశాడు. దానిని వలసరవక్కమ్‌లోని తన ఇంట్లో భద్రపరిచాడు. దీనిని విక్రయించేందుకు డీలర్లతో చర్చలు జరుపుతున్నాడు. వారిలో కొందరు జుట్టు నాణ్యతను పరీక్షించేందుకు ఇంటికి వచ్చారు.
అయితే మే 18న ఇంట్లోని జుట్టు మాయం కావడంతో వెంకట్రామన్ వెంటనే పోలీసులను ఆశ్రయించాడు. అతడు ఇచ్చిన వివరాల మేరకు నిందితుడైన ఎస్.అబుబకర్ (39)ను మన్నాడిలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో ముగ్గురితో కలిసి ఇంటి తలుపులు పగలగొట్టి లోపలికి ప్రవేశించి జుట్టును దొంగిలించినట్టు అబు బకర్ పోలీసుల విచారణలో వెల్లడించాడు. దొంగిలించిన జుట్టును ఆంధ్రప్రదేశ్‌లో దాచినట్టు చెప్పాడు. దానిని స్వాధీనం చేసుకున్న పోలీసులు మిగతా ముగ్గురి కోసం గాలిస్తున్నారు. అబుబకర్ గతంలో ఓ హత్య కేసులో నిందితుడని పోలీసులు తెలిపారు.