: కోమీ లిఖితపూర్వక వాంగ్మూలంపై ట్రంప్ ఆగ్రహం... వెనక్కి తగ్గేది లేదని ప్రకటన!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన విధులకు ఆటంకం కలిగేలా ప్రవర్తించారని, తనపై అసత్యాలు ప్రచారం చేశారని చెబుతూ సెనేట్ నిఘా కమిటీకి సుమారు ఏడు పేజీల లిఖితపూర్వక వాంగ్మూలాన్ని ఎఫ్బీఐ మాజీ డైరెక్టర్ జేమ్స్ కోమీ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై ట్రంప్ తన మద్దతుదారులను ఉద్దేశించి మాట్లాడుతూ, తనను అధ్యక్ష పదవి నుంచి దించేందుకు చేసే ప్రయత్నాలను తిప్పికొడతానని చెప్పారు. తనపై ఎన్ని అసత్యాలు, తప్పుడు ప్రకటనలు ఇస్తున్నారో తనకు తెలుసని ఆయన అన్నారు. వాటన్నింటిపైన ఎలా పోరాడాలో కూడా తనకు తెలుసని ఆయన స్పష్టం చేశారు. తమపై అసూయ ద్వేషాలు ప్రచారం చేస్తారని, అయినా సరే ప్రజలు ఏ మార్పు కోసమైతే ఓటేశారో ఆ మార్పును వారు కచ్చితంగా చూస్తారని ఆయన స్పష్టం చేశారు.
అంతే కాకుండా దానిపై వైట్ హౌస్ కూడా స్పందించింది. కోమీ వాంగ్మూలం వాస్తవం కాదని వైట్ హౌస్ స్పష్టం చేసింది. అమెరికా అధ్యక్షుడు అబద్ధాలకోరు కాదని, జేమ్స్ కోమీ అంశంపై జర్నలిస్టు ప్రశ్నించడం అవమానకరమని వైట్ హౌస్ ప్రతినిధి సారా హకబీ శాండర్స్ అభిప్రాయపడ్డారు.