: ఆధార్ లేకుంటే ‘సంక్షేమ’ ఫలాలు అందించేది లేదు.. సుప్రీంకు తెలిపిన కేంద్రం
జూన్ 30 తర్వాత ఆధార్ లేని వారికి సంక్షేమ పథకాల ఫలితాలు అందించేది లేదని కేంద్రం తెగేసి చెప్పింది. ఈ మేరకు సుప్రీంకోర్టుకు తెలిపింది. ఆధార్ రిజిస్ట్రేషన్ అవకాశాలు లేని ప్రాంతాల్లో మాత్రం ఈ విషయంలో మినహాయింపు ఉంటుందని, ఇతరులకు మాత్రం ఎటువంటి సడలింపు ఉండదని తేల్చి చెప్పింది. ఆధార్ నమోదు అవకాశాలు లేని ప్రాంతాల వారు అధికారుల వద్ద వారి వివరాలు, ఫోన్ నంబరు నమోదు చేసుకుంటే ఆయా ప్రాంతాల్లో ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ అవకాశాలను కల్పిస్తామని, అటువంటి వారికి సంక్షేమ పథకాలు కొనసాగుతాయని సుప్రీంకు సమర్పించిన అఫిడవిట్‌లో కేంద్రం పేర్కొంది.
దేశంలో 95 శాతం మంది జనాభాకు ఆధార్ ఉందని, కాబట్టి ఆధార్‌ను తప్పనిసరి చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలయ్యే పిటిషన్లను విచారించరాదని కోరింది. సంక్షేమ పథకాలతో ఆధార్‌ను అనుసంధానం చేయడం వల్ల గత రెండున్నరేళ్లలో రూ.49,560 కోట్ల ప్రజాధనం వృథా కాకుండా నిలువరించగలిగినట్టు తెలిపింది. ఈ సందర్భంగా ప్రపంచ బ్యాంకు వ్యాఖ్యలను ప్రస్తావించింది. సంక్షేమ పథకాలతో ఆధార్‌ను అనుసంధానం చేయడం వల్ల ప్రతి ఏడాది 11 బిలియన్ డాలర్లను పొదుపు చేయవచ్చని వరల్డ్ బ్యాంకు పేర్కొందని సుప్రీంకోర్టుకు తెలిపింది.