: భారత్ పై గెలుస్తామని అనుకోలేదు: శ్రీలంక కెప్టెన్ మాథ్యూస్
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా నిన్న జరిగిన భారత్, శ్రీలంక మ్యాచ్‌లో టీమిండియా ఓటమి పాలైన విషయం తెలిసిందే. తమ జట్టు భారత్‌పై విజయం సాధించడం పట్ల శ్రీలంక జట్టు కెప్టెన్ మాథ్యూస్ మాట్లాడుతూ.. హర్షం వ్యక్తం చేశాడు. భారత్‌పై దూకుడుగా ఆడాలని తమ మాజీ కెప్టెన్ కుమార సంగక్కర చెప్పాడని, ఆయన చేసిన సూచనే తమ విజయానికి కారణం అయిందని చెప్పాడు. తాము ఎటువంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగామని చెప్పాడు. ఈ టోర్నీలో తమపై ఎంతో ఒత్తిడి ఉందని, భారత్‌తో మ్యాచ్ గెలుస్తామని అనుకోలేదని అన్నాడు. ఇటీవలి కాలంలో విజయాలు లేని తమకు ఈ గెలుపు ఊరటనిచ్చిందని చెప్పాడు. ఈ మ్యాచులో మెండీస్, గుణతిలకలు అద్భుతంగా రాణించారని అన్నాడు. ఈ గెలుపుతో తమలో ఆత్మవిశ్వాసం పెరిగిందని చెప్పాడు.