: చంద్రబాబు నెరవేర్చని వాగ్దానాన్ని గుర్తు చేస్తున్న అనంత వాసులు!
అనంతవాసుల నీటి కష్టాలను తీర్చేలా గత సంవత్సరం చంద్రబాబునాయుడు ఇచ్చిన వాగ్దానాన్ని ఇప్పటికీ అమలు చేయడం లేదని రాయదుర్గం ప్రాంత వాసులు అసంతృప్తితో ఉన్నారు. ఆయన ఇచ్చిన హామీని గుర్తు చేస్తూ, అది ఎప్పటికి అమలవుతుందని ప్రశ్నిస్తున్నారు. ఈ హామీ, ప్రజల అసంతృప్తికి గల కారణాల వివరాలలోకి వెళితే...
ఆగస్టు 30, 2016... అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం, గుమ్మఘట్టలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతున్న వేళ భైరవానితిప్ప ప్రాజెక్టు (బీటీపీ)ను ఏడాదిలోగా పూర్తి చేసి నీరిస్తామని చంద్రబాబు ప్రజలకు హామీ ఇచ్చారు. ఆపై ప్రాజెక్టుకు రూ. 1300 కోట్లు అవుతుందని తొలుత, ఆ మొత్తం ఎక్కువన్న ఉద్దేశంతో రూ. 1100 కోట్లతోనే పూర్తి చేయవచ్చని అధికారులు నివేదికలు ఇచ్చారు. ఆపై ఇంకో రిపోర్టు ఇస్తూ, భైరవానితిప్ప ప్రాజెక్టును రూ. 800 కోట్లతోనే పూర్తి చేయవచ్చని చెప్పారు. చంద్రబాబు హామీ ఇచ్చి 10 నెలలు గడుస్తోంది. ఆయన చెప్పిన ఏడాది వ్యవధి మరో రెండు నెలల్లో పూర్తి కానుండగా, ఇప్పటివరకూ ప్రాజెక్టుకు సంబంధించిన ఒక్క పని కూడా మొదలు కాలేదు. ఈ సంవత్సరం తమ పొలాలకు నీరందుతుందని భావించిన రైతులకు నిరాశే మిగిలింది.
భైరవానితిప్ప ప్రాజెక్టుకు సంబంధించిన ఫైలు ఈ పది నెలల కాలంలో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. దీనిపై చంద్రబాబు తక్షణం స్పందించి చర్యలు తీసుకోవాలన్నది ఈ ప్రాంత రైతుల డిమాండ్. తాము చంద్రబాబుపై ఎన్నో ఆశలు పెట్టుకున్నామని, తమ సమస్యలను అర్థం చేసుకుని వాటిని పరిష్కరిస్తారని ఎదురు చూస్తున్నామని రైతులు అంటున్నారు.