: అమెరికాలో ఇండియన్స్ పై మరోసారి జాత్యహంకార వ్యాఖ్యలు!
అమెరికాలో భారతీయుల పట్ల అసహనం ఎక్కువవుతోంది. ఇప్పటికే జాత్యహంకార ఘటనలను మనం చాలా చూశాం. ట్రంప్ అధ్యక్షుడు అయిన తర్వాత ఇవి మరింత పెరిగాయి. తాజాగా మరోసారి జాతి విద్వేషం పడగవిప్పింది. న్యూజెర్సీ రాష్ట్రంలోని న్యూ బ్రున్స్ విక్ లో ఉన్న ఓ స్టోర్ లో ఈ ఘటన జరిగింది. స్టోర్ లో ఒకే క్యాష్ కౌంటర్ తెరిచి ఉంది. ఆ కౌంటర్ లో భారతీయ ఉద్యోగి ఉన్నాడు. క్యూ పెద్దదిగా ఉంది. దీంతో, క్యూలో నిలుచున్న ఓ శ్వేతజాతి మహిళ సహనాన్ని కోల్పోయింది. స్టోర్ లో ఇండియన్ ఉద్యోగులను నియమించుకుని, క్యూలో ఇండియన్స్ వెనకాల మమ్మల్ని నిలబెడుతున్నారంటూ గట్టిగా అరిచింది. 'ఇండియన్స్ ను వెంటనే ఇండియాకు పంపించేయండి' అంటూ అరిచింది. ఈ మాటలను అదే లైన్ లో ఉన్న ఓ వ్యక్తి ఫోన్ లో రికార్డ్ చేసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
క్యూలో తన ముందు ఉన్న వ్యక్తులను ఇండియన్స్ గా ఆమె భావించిందని... కౌంటర్ లో ఉన్న ఇండియన్ వీరికి అత్యధిక ప్రాధాన్యతను ఇస్తున్నాడనే ఆగ్రహంతో ఆమె ఇలా చేసి ఉండవచ్చని సదరు వ్యక్తి తెలిపాడు. వాస్తవానికి వారు లాటిన్ అమెరికన్ కుటుంబీకులని... వారి వద్ద ఉన్న కొన్ని వోచర్లను క్లియర్ చేసుకోవడానికి, వారికి సమయం పట్టిందని... ఈ సమయంలోనే సదరు మహిళ సంయమనం కోల్పోయిందని చెప్పాడు.