: భారత కార్పొరేట్ చరిత్రలో మరో సంచలనం... ఇన్ఫోసిస్ నుంచి పూర్తిగా తెగదెంపులు చేసుకోనున్న మూర్తి, నిలేకని


భారత కార్పొరేట్ చరిత్రలో సంచలనం కలగనుంది. ఐటీ సేవల దిగ్గజం ఇన్ఫోసిస్ నుంచి వ్యవస్థాపకులు నారాయణమూర్తి, నందన్ నిలేకనిలు పూర్తిగా తప్పుకోవాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. సంస్థకు సహ వ్యవస్థాపకులుగా ఉన్న వీరు తమ వద్ద ఉన్న 12.7 శాతం ఈక్విటీ (విలువ సుమారు రూ. 28 వేల కోట్లు)ని విక్రయించాలని నిర్ణయించుకున్నట్టు సంస్థ వర్గాలు వెల్లడించాయి. బోర్డులో డైరెక్టర్ల వైఖరిని, ఉన్నతాధికారులకు జీతాలను పెంచుతున్న విధానాన్ని గతంలో పలుమార్లు తప్పుబట్టిన ప్రమోటర్లు, బహిరంగంగానే చురకులు అంటించిన సంగతి తెలిసిందే. అయినా డైరెక్టర్ల వైఖరి మారకపోవడంతో, ఇక పూర్తిగా తప్పుకోడమే మేలని వ్యవస్థాపకులు భావిస్తున్నారు.

కాగా, 1981, జూలై 2న పుణె కేంద్రంగా ఇన్ఫోసిస్ ను నారాయణ మూర్తి, నందన్ నిలేకని, క్రిష్ గోపాలకృష్ణన్, ఎస్డీ షిబూలాల్, కే దినేష్ లు ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఆపై హెడ్ క్వార్టర్స్ ను బెంగళూరుకు మార్చారు. అంచెలంచెలుగా ఎదుగుతూ, 1993లో ఐపీఓకు వచ్చిన సంస్థ, ఆపై ఇండియాలో రెండవ అతిపెద్ద ఐటీ కంపెనీగా ఎదిగింది. నాటి వ్యవస్థాపకులెవరూ ప్రస్తుతం కంపెనీలో ఎగ్జిక్యూటివ్, లేదా నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా లేకపోవడమే సమస్యలకు కారణమైంది. వారంతా తప్పుకున్న తరువాత వచ్చిన డైరెక్టర్లు పలు వివాదస్పద నిర్ణయాలు తీసుకున్నారు. దీంతో సంస్థ నైతిక ప్రమాణాలు దెబ్బతింటున్నాయని మూర్తి స్వయంగా విమర్శించినా, ప్రస్తుత సీఈఓ విశాల్‌ సిక్కా తన వైఖరిని మార్చుకోలేదని తెలుస్తోంది. దీంతో సిక్కా వైఖరితో విసుగెత్తి పూర్తిగా తెగదెంపులు చేసుకోవాలని ప్రమోటర్లు నిర్ణయించుకున్నట్టు సమాచారం. స్టాక్ మార్కెట్లలో బ్లాక్ డీల్స్ మార్గంలో వీరు తమ వాటాలను అమ్మేయనున్నట్టు మార్కెట్ వర్గాలు వ్యాఖ్యానించాయి.

  • Loading...

More Telugu News